- భవిష్యత్తు ప్రశ్నార్థం
- పాలకులది పాత పల్లవే..
- ‘మెదక్’తోనే అభివృద్ధి: మేధావులు
- సంగారెడ్డితో విడదీయరాని
- అనుబంధం: స్థానిక నేతలు
- ‘సాక్షి’ కథనానికి స్పందన
- పొద్దంతా కాయకష్టం చేసే జనం. సావైనా బతుకైనా ‘సాగే లోకం’.
చెమటను పారించి.. దిగుబడి సాధించటమే వాళ్ల వ్యాపకం. నిజాం రాజుల ఏలుబడి నుంచి ఖేడ్‌కు ‘ఎద్దు– ఎవుసమే’ ఆదెరువు. స్వాతంత్య్రం వచ్చి కూడా 70 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి సంగారెడ్డితోనే నారాయణఖేడ్‌కు అనుబంధం. ఈ 70 ఏళ్ల కాలంలో ప్రాథమిక జీవన ఆధారమైన వ్యవసాయం రంగం ఏనాడూ ‘బాల్య’దశ దాటలేదు.
ఈ ఏడాది మొదటి పాదం వరకు కనీసం నియోజకవర్గం కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ లేదు. ఇక్కడి రైతును బీదర్, లాతూర్, ఉద్గీర్ వ్యవసాయ మార్కెట్లు చేరదీశాయి. కానీ సొంత జిల్లా మార్కెట్ ఏనాడూ దగ్గరకు రానివ్వలేదు. పునర్విభజనతోనైనా కొత్త ఆశలు చిగురిస్తాయకుంటే.. పాలకులు మళ్లీ పాత పల్లవినే ఎత్తుకోవడంతో ఖేడ్ రైతాంగం భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోందని వ్యవసాయ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
నారాయణఖేడ్ నియోజకవర్గం వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రాంతం. పట్టా, ప్రభుత్వ, అటవీ భూములు కలుపుకుని మొత్తం 2.50 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 75 వేల రైతు కుటుంబాలున్నాయి. ఇందులో 1.85 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూములున్నప్పటికీ సాగు నీళ్లు లేక 1.20 లక్షల ఎకరాల్లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పంట పండుతోంది. నల్లవాగు ప్రాజెక్టు కింద కలే్హర్ మండలంలో 6 వేల ఎకరాలు, 200 కుంటలు, 50 చెరువుల ద్వారామరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.
నియోజకవర్గం వ్యాప్తంగా చిన్న కమతాలు కలిగిన సన్న చిన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఉన్న కొద్దిపాటి భూమికి సాగునీటి వసతి చేసుకోలేక భూములను బీడు పెట్టి వలస బాట పడుతున్నారు. నియోజకవర్గం నుంచి యోటా కనీసం 75 వేలకు మందికి పైగా రైతులు, రైతు కూలీలు వలస పొతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో ప్రధానంగా పెసర, మినుము, కంది, జొన్న, పత్తి, సోయా, వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలను సాగుచేస్తారు. కలే్హర్, పెద్దశంకరంపేట మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు అధికంగా సాగవుతాయి. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద వరి, మొక్కజొన్న, చెరకు, సాగుచేస్తారు. నియోజకవర్గం నుంచి ఏడాదికి సగటున 1352.37 టన్నుల వివిధ రకాల పంట దిగుబడి వస్తోంది.
ఇందులో సోయా11094హెక్టార్లకు గాను 221.88 టన్నులు,పత్తి 13427హెక్టార్లులో 268.54 టన్నులు, వరి 25,368 హెక్టార్లకు గాను 203 టన్నులు, మొక్కజొన్న 4587 హెక్టార్లలో 321.09 టన్నులు దిగుబడితో అగ్రస్థానంలో ఉన్నాయి.
ఆ తరువాత స్థానంలో ఉల్లి, పప్పుధాన్యాలున్నాయి. గడిచిన పదేళ్ల మార్కెట్ విక్రయాలను రికార్డును పరిశీలిస్తే.. నారాయణఖేడ్ రైతులు పండించిన ధాన్యంలో కేవలం 5 శాతం మాత్రమే సంగారెడ్డి, జోగిపేట మార్కెట్‌కు వచ్చాయి. 20 శాతం పంటను కర్ణాటకలోని బీదర్ మార్కెట్‌కు, తరువాత వరుసగా ఔరాద్, మహారాష్ట్రలోని ఉద్గీర్, లాతూర్, దెగులూర్ మార్కెట్‌కు ధాన్యం విక్రయించినట్టు రికార్డులు చెప్తున్నాయి.
భౌగోళికంగా... సాగు జలాల లభ్యతను బట్టి చూస్తే నారాయణఖేడ్ ప్రాంతం భూమలు వ్యవసాయం కంటే పారిశ్రామికంగానే అనుకూలమైనవి, చవకైన భూములు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రాలేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల మీదనే దృష్టి పెట్టారు. ఎగుమతి, దిగుమతులకు హైదరాబాద్ అనుకూలం. మంచి రవాణా సౌకర్యంతో పాటు నాణ్యమైన పారిశ్రామిక ఉత్పత్తుల దిగుబడిని ప్రోత్సహించే వాతావరణం ఉండటంతో పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఇక నారాయణఖేడ్ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి వ్యవసాయమే మూలం. నీటి వనరులు అభివృద్ధి పరుచుకొని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవటమే మార్గం. అది జరగాలంటే సంగారెడ్డి జిల్లా ఎలా అనుకూలం అవుతుంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మెదక్‌జిల్లా వ్యవసాయక జిల్లాగా గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఘణపురం ఆయకట్టు కింద దాదాపు 20 వేల ఎకరాల్లో భూమి సాగు అవుతుంది. ఆనకట్ట ఎత్తు పెంచి మరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు కదులుతోంది. అదే జరిగితే మెదక్ జిల్లా దక్షిణ తెలంగాణ ధాన్యాగారంగా మారడం ఖాయం. ఈ క్రమంలో జిల్లాకు మరిన్ని వ్యవసాయ రాయితీలు, ప్రోత్సాహకాలు వచ్చే అవకాశం ఉంది. పంట విధానాలపై, మేలైన వంగడాల సృష్టి కోసం విస్తృతమైన ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంక్షేమ, ప్రయోగా ఫలాలు సహజంగానే జిల్లా అంతటికీ విస్తరించి వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశాలు అద్భుతంగా ఉంటాయని వ్యవసాయ పరిశోధకులు అంచనా వేస్తున్నాయి.
సాక్షి కథనం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మొదటి కథనంతోనే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫో¯ŒS చేసి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షట్కర్ సాక్షి కథనాలను ఖండించగా.. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్టు ఆర్ సత్యనారాయణ, మేధావులు, విద్యావంతులు, అధికారులు కథనాలను సమర్థించారు.