రైతు ఎస్సెమ్మెస్‌ పంపిస్తేనే సబ్సిడీ | new method in subsidy | Sakshi
Sakshi News home page

రైతు ఎస్సెమ్మెస్‌ పంపిస్తేనే సబ్సిడీ

Published Sun, Sep 25 2016 8:28 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

రైతు ఎస్సెమ్మెస్‌ పంపిస్తేనే సబ్సిడీ - Sakshi

రైతు ఎస్సెమ్మెస్‌ పంపిస్తేనే సబ్సిడీ

– ఎరువుల సబ్సిడీలో కొత్త విధానం
– నేరుగా కంపెనీలకు జమ
– ఎరువులు కొన్నట్టు రైతు ఎస్‌ఎంఎస్‌ పంపిస్తేనే..
– జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
– వచ్చేనెల 1 నుంచి అమలు
 
జంగారెడ్డిగూడెం :
ఎరువులకు ఇచ్చే సబ్సిడీపై ప్రభుత్వం కొత్త విధానం అమలుచేయనుంది. తొలుత ఎరువులకు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం యోచించినా అది సాద్యంకాదని భావించి కొత్త విధానానికి శ్రీకారంచుట్టింది. దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిరే్ధశించింది. వీటిలో రెండు జిల్లాలు రాష్ట్రానికి చెందినవి. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కాగా, మరొకటి కృష్ణా జిల్లా. అక్టోబర్‌ 1 నుంచి సబ్సిడీలపై కొత్త విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం నిరే్ధశించింది. వంటగ్యాస్‌ లాగానే ఎరువుల సబ్సిడీని రైతుల ఖాతాకు నేరుగా నగదు బదిలీని చేయాలని తొలుత కేంద్రం భావించినా దానిని పక్కన పెట్టింది. అయితే తాజాగా రైతులకు కాకుండా ఆయా ఎరువుల కంపెనీలకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా జమచేసే మొత్తాన్ని అక్టోబర్‌ 1 నుంచి కేంద్రం ప్రారంభించనుంది. రైతుకు ఎరువులు చేరిన తరువాతే సబ్సిడీ మొత్తం ఎరువుల కంపెనీల ఖాతాల్లో జమ అవుతుంది. ఈప్రయోగాత్మక పథకం అమలుకు దేశ వ్యాప్తంగా 8 జిల్లాలను గుర్తించింది. దీనిలో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ పథకం ద్వారా ఎరువుల దుర్వినియోగాన్ని నిరోధించడంతోపాటు, అసలు దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందో కూడా తెలుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎరువులు పక్కదారి పట్టడం, పక్క రాష్ట్రాలకు తరలి పోవడం, బ్లాక్‌ మార్కెటింగ్‌ తదితర అవినీతి మార్గాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎరువులకు ఇచ్చే సబ్సిడీని ఆయా ఎరువుల కంపెనీల నుంచి డీలర్ల ద్వారా రిటైల్‌ వ్యాపారులకు చేరిన తరువాత కంపెనీ ఇచ్చిన లెక్క ప్రకారం సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తోంది.  ఈ విధానంలో ఎరువులు పక్కదారిపట్టడం కారణంగా కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికంగాపడుతున్నట్లు గుర్తించింది. వీటన్నింటిని అరికట్టేందుకు ఇటీవల ఈపోస్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కొత్త సబ్సిడీ విధానాన్ని అమలు చేయనుంది. కొత్త విధానంలో రైతులకు అమ్మిన ఎరువులకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. దీనికోసం కంప్యూటర్‌ ఆధారిత డిజిటల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తుంది. ఎరువులు అమ్మే సమయంలో రైతుల వివరాలను దీనిలో నమోదు చేయాలి. ఎరువులు కొనుగోలు చేసిన తరువాత రైతు తన మొబైల్‌ఫోన్‌ ద్వారా ఫెర్టిలైజర్స్‌ మానిటరింగ్‌ వ్యవస్థకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఈ ఎస్‌ఎంఎస్‌ అందిన తరువాత ఏ కంపెనీ ఎరువు ఏ రైతు ఎంతకు కొన్నాడో ఆ కంపెనీకి ప్రభుత్వం సబ్సిడీని జమచేస్తుంది. ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈపోస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగా , తాజాగా కొత్త విధానం కూడా అమలులోకి తేనుంది. దీనికి రైతు ఆధార్‌ నెంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు రైతులు, కౌలు రైతులు, అన్ని రకాల రైతులు కలిపి సుమారు 5 లక్షల మంది ఉన్నారు. ఖరీఫ్‌సీజన్‌లో 1.64 లక్షల మెట్రిక్‌ టన్నులు వినియోగిస్తుండగా, రబీ సీజన్‌లో 2.33 లక్షల టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. కాగా జిల్లాలో ప్రై వేట్‌డీలర్లు, సొసైటీల ద్వారా ఎరువులు సరఫరా , డీసీఎంఎస్‌ ద్వారా ఎరువుల సరఫరా మొత్తం అందరూ కలిపి 1160 మంది డీలర్లు ఉన్నారు. 
కొత్తవిధానం అమలు సాధ్యమేనాః
ఎరువుల సబ్సిడీ లో కొత్త విధానం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహం వ్యక్తంచేస్తున్నారు. రైతుల్లో అంతగా చదువుకున్న వారు తక్కువగా ఉంటారని, రైతులందరికీ ఎరువులు కొనుగోలు చేసిన తరువాత ఎస్‌ఎంఎస్‌ పంపేందుకు సెల్‌ఫోన్‌లు ఉంటాయన్నది ప్రశ్నార్ధకమే. దీనికోసం రైతులకు సెల్‌ఫోన్‌లు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. అంతేగాక ఎక్కువ శాతం కౌలురైతులే ఉంటారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement