దీపికాజ్యోతి, సత్య పెళ్లి ఫొటో
♦ నరసాపురంలో వివాహిత ఆత్మహత్య
♦ పెళ్లయిన 32 రోజులకే పరలోకాలకు..
♦ విషాదంతో ముగిసిన ప్రేమ వివాహం
♦ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
నరసాపురం : పెళ్లయిన 32 రోజులకే ఆ మెకు నూరేళ్లు నిండిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కట్న వేధింపులు బలి తీసుకున్నాయి. ఉన్నత చదువులు చదివిన ప్రేమ జంట వివాహం విషాదాంతమయ్యింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని 7వ వార్డుకు చెందిన సిద్దాని వెంకటరామకృష్ణ (బాలు), కనకదుర్గా మహాలక్ష్మి కుమార్తె దీపికాజ్యోతి (24) బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు గతనెల 12న నరసాపురం మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన రావి నాగ వెంకట సత్యనారాయణ (సత్య)తో వివాహమైంది. వీరిద్దరూ ఇంటర్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. సత్య కుటుంబం కూడా కొంతకాలంగా పట్టణంలోనే ఉంటోంది.
సూసైడ్‌నోట్ దీపికాజ్యోతి మృతదేహం
ఇంటర్ నుంచి ప్రేమ
దీపికాజ్యోతి, సత్య ఇద్దరూ ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. సత్య ఇంజినీరింగ్, దీపికాజ్యోతి ఎంబీఏ చదివారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాలు వీరి వివాహానికి అంగీకరించారు. గతనెల 12న వీరి వి వాహం నరసాపురంలో జరిగింది. సత్య చెన్నైలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, దీపికాజ్యోతి పుట్టింట్లోనే ఉం టోంది. ఏం జరిగిందో తెలియదు కాని బుధవారం రాత్రి దీపికాజ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. ‘మీ కూతురు ఫోన్ ఎత్తడంలేదు.. ఎక్కడుందో చూడండని’ అల్లుడు సత్య వద్ద నుంచి ఫోన్ రాగా, ఇంట్లో పక్కగది గడియవేసి ఉందని చూస్తే ఉరివేసుకుని దీపికాజ్యోతి చనిపోయిందని ఆమె తల్లి మహాలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అంతకు ముందే భార్యాభర్తలిద్దరూ అరగంట సేపు మాట్లాడుకున్నారని చెప్పింది. ప్రేమ వివాహం అయినా పెళ్లి సమయంలో రూ.10 లక్షలు కట్నం ఇచ్చామని, అ యినా అత్త, అల్లుడు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు ప్రాథమికంగా దర్యాప్తు జరిపారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లి దీపికాజ్యోతి తల్లితండ్రులతో మాట్లాడారు. పట్టణానికి వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా విషయం తెలుసుకుని ప్రభుత్వాస్పత్రి వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. కేసు విచారణ వేగవంతం చేయాలని పోలీస్ శాఖకు సూచించారు.