తిరుగు ప్రయాణానికి ఇక్కట్లు | no Availability berths in trains | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణానికి ఇక్కట్లు

Published Sat, Oct 24 2015 8:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

తిరుగు ప్రయాణానికి ఇక్కట్లు

తిరుగు ప్రయాణానికి ఇక్కట్లు

విశాఖపట్నం : దసరా పండగ గడిచిపోయింది. ఊళ్లకెళ్లినవారంతా ఇప్పుడు  స్వస్థలాలకు లగేజీలు సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం నుంచీ విధుల్లోకి చేరాలని ఉద్యోగులు, బడికి పోవాలని విద్యార్ధులు సన్నద్ధమవుతున్నారు. వీరందరికీ గమ్యం చేరుకునేందుకు ఒకటే మార్గం.  రైళ్ల మీదే ఆధారపడుతున్నారు. బెర్తులన్నీ దసరాకు రెండు మాసాల ముందే రిజర్వేషనులో నిండిపోతే ఇప్పుడు తత్కాల్ కోటాలో బెర్తు లభ్యమైనా ఇంటిల్లిపాదీ సర్దుకుపోదామనే రైల్వే ఎంక్వైరీ మొదలెట్టారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లోని విచారణ కార్యాలయం వద్ద వేలాది మంది ఎంక్వైరీ చేపట్టారు.
 
ఆదివారం రద్దీ ప్రభావం సోమవారం కూడా కొనసాగుతుందని రైల్వే వర్గాలు ప్రకటించడంతో తత్కాల్ కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. అందరి ప్రయాణికుల దృష్టి కేవలం ఆదివారం రైళ్లపైనే ఉండడంతో ఆ రోజు ప్రయాణాలు అంత ఈజీ కాదని అంటున్నారు. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో బెర్తులు లేకపోవడంతో ఆదివారం ప్రయాణం కోసం అధిక శాతం ప్రయాణికులు ప్యాసింజర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. బెర్తులు దొరకని ప్రయాణికులతో పాటు ప్యాసింజర్ల రైళ్లనే రెగ్యులర్‌గా నమ్ముకునే సాధారణ ప్రయాణికులతో ఆదివారం రైళ్లు కిటకిటలాడే అవకాశాలున్నాయి.  
 
కొనసాగుతున్న అష్టకష్టాలు...
విశాఖ నుంచి హౌరా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల అవస్థలు నెలాఖరువరకూ కొనసాగడం ఖాయమని స్పష్టమవుతోంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు (12704) స్లీపర్, థర్డ్ ఏసీ క్లాసులకు ఆదివారం నుంచి వరుసగా నాలుగు రోజులు రిగ్రెట్, ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌కు (18646) స్లీపర్ క్లాసులో శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు రిగ్రెట్ ఏర్పడగా థర్డ్ ఏసీ క్లాసుకు వారంరోజుల పాటు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కోరమండల్ (12842), మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లకు (12840) చాంతాండంత నిరీక్షణ జాబితా నెలకొంది. వీటితో పాటు వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో బెర్తులు లభించే ఛాన్స్‌లు లేవు.
 
 గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు (12727) ఆదివారం రిగ్రెట్ చూపగా మరో వారం రోజుల పాటు నిరీక్షణ జాబితా కొనసాగుతోంది.
 విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో (17015) ఆదివారం ప్రయాణానికి నిరీక్షించే ప్రయాణికులు 196 మంది ఉన్నారు.
 ఎల్‌టీటీ (18519), ఫలక్‌నామా (12703) ఎక్స్‌ప్రెస్‌లలో నిరీక్షణ జాబితా 200 మందికి పైనే ఉంది.
 కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020), విజయవాడ వెళ్లే జన్మభూమి ఇంటర్ సిటీ (12805) ఎక్స్‌ప్రెస్‌లలో నిరీక్షణ జాబితా 300 పై చిలుకే చేరుకుంది.
 అన్ని రైళ్లలోనూ ఏసీ చైర్‌కార్‌కు టికెట్ రాని (రిగ్రెట్) పరిస్థితి ఉంది.
 సింహాద్రి (17240), రత్నాచల్ (12717) రైళ్లకు చాంతాడంత నిరీక్షణ జాబితా ఉంది.
 బెంగళూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో (18463) నిరీక్షణ జాబితా  360కు పైగా ఉంటే టాటా-యశ్వంత్‌పూర్ (12889), హౌరా-యశ్వంత్‌పూర్ (12863) రైళ్లకు భారీ ఎత్తున నిరీక్షణ జాబితా కొనసాగుతోంది. ఈ రైళ్లకు విశాఖ నుంచి కోటా లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement