నానా అగచాట్లు పడుతున్న సందర్శకులు
రోజుల తరబడి తిరిగినా కలవడం అనుమానమే
సీఎం కార్యాలయం వద్ద భద్రత పేరుతో హంగామా
సందర్శకుల వేళలు పాటించని కార్యాలయం
విజయవాడ : వివిధ సమస్యలపై ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే సందర్శకులు ఆయన కార్యాలయం వద్ద అష్టకష్టాలు పడుతున్నారు. అనేక అడ్డంకులు దాటుకుని సీఎం కార్యాలయం వద్దకు చేరుకున్నా లోనికి వెళ్లడమంటే గగనమే. వారానికో, పది రోజులకో ఆయనకు సమయం కుదిరితే సందర్శకులను లోనికి పంపిస్తున్నారు. లేకపోతే గేటుకు ఇవతలే నిలిపివేస్తున్నారు. దీంతో ఆయన సాయంకోసం ఎంతో ఆశతో వచ్చినవారి ఆవేదనలు సీఎం కార్యాలయం వద్ద నిత్యకృత్యంగా మారాయి. ఆయన్ను కలవడానికి వచ్చే వారిలో 50 శాతం మంది నిరాశతోనే వెనుదిరుగుతున్నారు. మిగిలిన వారు లోనికి వెళ్లినా గంటల తరబడి అక్కడ కూడా వేచి ఉండక తప్పడం లేదు.
గంట సమయం ఉత్తుత్తిదే..
మొదట్లో సందర్శకుల కోసం ముఖ్యమంత్రి ప్రతి రోజూ గంట సేపు కేటాయిస్తారని ఆయన కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఎవరైనా వచ్చి ఆయన్ను కలవచ్చని కార్యాలయం గేట్లకు నోటీసులు అంటించారు. అది ఎన్నో రోజులు అమలు కాలేదు. జిల్లాల పర్యటనలు, విదేశీ యాత్రలతో ముఖ్యమంత్రి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవేళ కార్యాలయంలో ఉన్నా సమీక్షలు, సమావేశాలు, విదేశీ బృందాలతో భేటీలకే ఆయనకు సమయం ఉండడం లేదు.
దీంతో సందర్శకుల కోసం కేటాయించిన గంట సమయం గాల్లోనే కలిసిపోయింది. దీంతో సీఎం కార్యాలయ అధికారులు సందర్శకుల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి రోజూ 30 నుంచి 50 మంది వరకూ సీఎంను కలవడానికి వస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు చెప్పుకునేందుకు ఎక్కువ మంది కుటుంబాలతో కలిసి వస్తుండగా.. వృద్ధులు, వికలాంగులు సైతం తరచూ కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
కార్యాలయ సిబ్బంది ముందు వారి అర్జీలను తీసుకుని పరిశీలించి వివాదం కాదనుకుంటేనే లోనికి పంపుతున్నారు. ఆర్థిక సమస్యలు, భూవివాదాల సమస్యలతో వచ్చిన వారికి దాదాపు లోనికి పంపడం లేదు. ఉద్యోగం, ఇల్లు కావాలన్న వారిని చాలావరకూ లోనికి పంపడంలేదు. అనారోగ్య సమస్యలతో వచ్చిన వారినే ఎక్కువగా లోనికి అనుమతిస్తున్నారు. ఎప్పుడైనా సీఎం ఉంటే అదృష్టం కొద్దీ కొందరు ఆయన్ను కలుస్తున్నారు. లేకపోతే కార్యాలయ అధికారులే అర్జీలు తీసుకుని పంపిస్తున్నారు.