తీరు మారేదెన్నడో..!?
తీరు మారేదెన్నడో..!?
Published Thu, May 11 2017 11:21 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM
- ఉపాధ్యాయ బదిలీలపై కార్యరూపం దాల్చని మంత్రి ప్రకటన
- నేటికీ విడుదల కాని షెడ్యూల్
- దొడ్డిదారిన బదిలీలకు సన్నాహాలు
- ఆందోళనలో ఉపాధ్యాయులు
రాయవరం (మండపేట): వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామంటూ స్వయంగా విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. సెలవుల్లోనే బదిలీ ప్రక్రియ పూర్తయితే అన్ని విధాలా మేలు కలుగుతుందని ఉపాధ్యాయులు భావించారు. అయితే నేటికీ బదిలీల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో మంత్రి మాట నీటిమీద రాతగా మారిపోనుందా..అనే అనుమానం ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు దొడ్డిదారిన విద్యాశాఖలో బదిలీలకు తెరతీయడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీరు మారేదెన్నడో..
వేసవిలోనే ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రతిసారీ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించడం వల్ల పాఠశాలల్లో విద్యావ్యవస్థకు భంగం కలగకుండా ఉంటుంది. ఉపాధ్యాయుల పిల్లలను బదిలీ అయిన చోట పాఠశాలల్లో చేర్పించడానికి కూడా అవకాశం కలుగుతుంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుంది. 2015లో నిర్వహించిన బదిలీలను కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహిస్తామని చెప్పిన విద్యాశాఖ చివరకు మధ్యలో చేపట్టింది. వివిధ రకాల నిబంధనలు పెట్టి కాలయాపన చేసి చివరకు బదిలీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. చివరకు అక్టోబరు మాసాంతానికి ఆ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో సుమారు 19 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2015లో బదిలీలు జరిగిన సమయంలో జిల్లాలో సుమారు రెండు వేల మంది వివిధ ప్రాంతాలకు బదిలీలయ్యారు.
వచ్చే నెలలోనేనా...
ఉపాధ్యాయులు బదిలీలు జరుగుతాయా? జరగవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు పొందుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణలు వచ్చే నెల ఐదో తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే వచ్చే నెలలోనే షెడ్యూల్ విడుదలై విద్యా సంవత్సరం ప్రారంభంలో బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకూ బదిలీల షెడ్యూల్ ప్రకటించని ప్రభుత్వం మరోవైపు దొడ్డిదారిన బదిలీలకు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అటువంటివి లేకపోయినా రాష్ట్రంలో పలు జిల్లాల్లో దొడ్డిదారి బదిలీలు జరగడంతో రెండు రోజుల కిందట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆయా డీఈవో కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు.
పెడచెవిన పెడుతున్న ప్రభుత్వం..
బదిలీలు వేసవి సెలవుల్లోనే చేపట్టాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీనివల్ల విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.
– పి.సుబ్బరాజు, జిల్లా అధ్యక్షుడు, ఎస్‌టీయు.
అందుకే కాలయాపన..
దొడ్డిదారిన బదిలీలు చేసుకునేందుకే ప్రభుత్వం బదిలీల షెడ్యూల్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. పలు రకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం దొడ్డిదారి బదిలీలకు తెరతీస్తోంది.
– టి.కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
తొలుత పదోన్నతులు ఇవ్వాలి..
బదిలీ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. దీనికి ముందే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలి. బదిలీలు జాప్యం జరగడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారు.
– చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయు.
Advertisement