ఒంగోలు: ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఏపీకి ఎటువంటి నష్టం జరగదని, అంతకన్నా ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధి సాధ్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి హోదా విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. ఒంగోలులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రధానిని కలిసిన తర్వాతే ముఖ్యమంత్రి హోదా కన్నా అధిక నిధులు కావాలని అడుగుతున్నారని చెప్పారు. ఆ పార్టీ నాయకులు మాత్రం అయోమయ ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు.
అమృత్ పథకంలో అమరావతికి చోటుకు సిద్ధం
అమృత్ పథకంలో భాగంగా అమరావతిని 30వ నగరంగా చేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమృత్ పథకంలో 29 నగరాలను కేంద్రప్రభుత్వం చేర్చిందని, 30వ నగరంగా అమరావతికి చోటు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నాయకులు అయోమయ ప్రకటనలు వీడి అమృత్ పథకంలో అమరావతిని చేర్చుకునేందుకు అవసరమైన ప్రక్రియపై దృష్టిసారించాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, దానికి రాష్ట్రం 30శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాల్సి ఉన్నా మొత్తం 100శాతం నిధులు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు.ప్రత్యేక హోదాపై ప్రజలలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గందరగోళాన్ని తొలగించేందుకు బీజేపీతోపాటు టీడీపీ కూడా కలిసి వచ్చి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అసోంలో విజయబావుటా ఎగురేసినట్టే 2019లో ఏపీలో గెలుపు లక్ష్యంగా బీజేపీ సిద్ధ అవుతుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పి.వి.కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు, రాష్ట్ర కార్యదర్శి బి.మీనాకుమారి తదివతరులు పాల్గొన్నారు.
హోదా రాకపోయినా ఏపీకి నష్టం లేదు
Published Sat, May 21 2016 10:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement