
‘బతికున్నట్లు రుజువు’ అవసరం లేదు!
• ఆసరా పథకానికి నిబంధన ఎత్తివేత
• ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
• గతంలో ఆసరా పింఛన్ దారులకు అమలు
• ఈ నెలనుంచి అవసరం లేదని ఆదేశాలు
• ‘లైవ్’ నిర్ధారణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లదే
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
మృతిచెందిన లబ్ధిదారుల పేర్లపై పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్ల నమోదు అమలు చేసింది. ఇందులో తలెత్తుతున్న ఇబ్బందులను గుర్తించి ఇకనుంచి అవసరం లేదని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జనవరినుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నాం. – కట్ట దామోదర్‌రెడ్డి, డీఆర్‌డీఓ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఆసరాకింద పింఛన్ పొందాలంటే కచ్చితంగా బతికున్నట్లు రుజువు సర్టిఫికెట్ (లైవ్ ఎవిడెన్స్) సమర్పించాలి అన్న నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్ల కోసం మీసేవ, ఈసేవ కేంద్రాల్లో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భావించిన ప్రభుత్వం..ఈ నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెలనుంచి లైవ్ సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆసరా పింఛన్లను సాధారణంగానే పంపిణీ చేసేవారు. గత ఏడాది జూలైనుంచి ప్రభుత్వం లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్ల ఉంటేనే పింఛన్ అనే నిబంధన పెట్టింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా పింఛన్ల పొందే వారికి ఈ విధానాన్ని అమలు చేస్తు వచ్చారు. అనర్హులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం దీనిని అమలు చేయాలనుకున్నారు. కానీ 6 నెలలుగా సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడిన లబ్ధిదారులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరటనిచ్చినట్లు అయింది.
లబ్ధిదారుల నిర్ధారణ బాధ్యత వారిద్దరిదే..
లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్ల రద్దుతో లబ్ధిదారులు బతికే ఉన్నారా లేదా అని నిర్ధారించే బాధ్యత ప్రభుత్వం గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, çమున్సిపాలిటీల్లో బిల్‌కలెక్టర్లపై పెట్టింది. కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారు ఉన్నారా లేదా అని స్వయంగా నిర్ధారించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఎవరు పింఛన్లు పంపిణీ చేస్తారో వారే సర్వే చేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలను పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓకు, బిల్ కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్‌కు అందించాల్సి ఉంటుంది. మూడు నెలలనుంచి లబ్ధిదారులు పింఛన్లు తీసుకోకుండా ఎందుకు ఉన్నారో కూడా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
1,64,078 మంది లబ్ధిదారులు
జిల్లావ్యాప్తంగా 1,64,078 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధాప్య 64,009, వితంతువు 71,555, వికలాంగులు 21,176, చేనేత కార్మికులు 3,237, గీతకార్మికులు 1,432, బీడీకార్మికులు 2,669 మంది ఉన్నారు. వీరందరికీ రూ.22,53,09,000 ఖర్చవుతుంది. బ్యాంక్ అకౌంట్ల ద్వారా 49594మంది లబ్ధిదారులకు, పోస్టాఫీసు ద్వారా 98,813 మందికి పంపిణీ చేస్తున్నారు. 15,671మంది లబ్ధిదారులకు గ్రామ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్ల ద్వారా మ్యాన్‌వల్‌గా అందజేస్తున్నారు.