ఉప్పు కొరత లేదు..!
* ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు
* నిల్వ చేసి కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు
* వ్యాపారులకు జేసీ వెంకటేశ్వరరావు హెచ్చరిక
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉప్పు నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు వ్యాపారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ హాలులో ఆదివారం ఉప్పు హోల్‌సేల్ విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ మార్కెట్లో ఉప్పు కొరత లేదని, ఉప్పు నిల్వలు తగినంత లేవనే ఆదుర్దాతో అధిక ధరలకు ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోల్‌సేల్ డీలర్లు తగినంత ఉప్పు బస్తాల నిల్వలు సిద్ధంగా ఉంచుకుని కొరత లేకుండా చూడాలని సూచించారు. లూజు ఉప్పుతో పాటు కంపెనీ ప్యాకెట్లపై ముద్రిత ధర కంటే అధిక ధరకు విక్రయిస్తే విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వదంతులు నమ్మొద్దు...
కిలో కల్లు ఉప్పు లూజు రూ. 4, ప్యాకెట్ రూపంలో అయితే కిలోకు రూ. 5.80, అయోడైజ్డ్ ఉప్పు వివిధ కంపెనీల వారీగా రూ. 12 మొదలు రూ. 18 వరకూ ఎంఆర్‌పీ ప్రకారం విక్రయించాలని ఉందని, దీనికి విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంతో పాటు రాష్ట్రంలోని ఉత్పత్తిదారుల దగ్గర ఉప్పు కొరత లేదని, ఉప్పు కొరత పేరుతో వస్తున్న వదంతులను ప్రజలెవ్వరూ నమ్మవద్దని సూచించారు. ఉప్పు కొరత ఏర్పడిందని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఓ దినపత్రికలో (సాక్షి కాదు) వచ్చిన వార్తను ఆయన ఖండించారు. హోల్‌సేల్ దుకాణాల్లో 20 టన్నుల చొప్పున ఉప్పు స్టాక్ ఉంచుకోవాలని, కిరాణా దుకాణాలు, సూపర్ బజార్లలో యథావిధిగా ఉప్పు విక్రయాలు జరపాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఇ. చిట్టిబాబు మాట్లాడుతూ కొరత పేరుతో ఉప్పు అక్రమ నిల్వ చేసిన మూడు దుకాణాలపై శనివారం సాయంత్రం దాడులు చేసి సరుకు సీజ్ చేసినట్లు చెప్పారు. అధిక ధరకు విక్రయిస్తే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.
ఉప్పు నిల్వ లేకపోవడంపై సీరియస్..
గుంటూరులోని హోల్‌సేల్ డీలర్ల వద్ద ఉప్పు నిల్వ లేకపోవడంపై జేసీ సీరియస్ అయ్యారు. సమీక్షలో భాగంగా వ్యాపారుల దగ్గర నిల్వల వివరాలు నమోదు చేస్తున్న సమయంలో ఏడుగురు డీలర్లు తమ దగ్గర ఉప్పు స్టాక్ లేదంటూ చెప్పడంతో ఆగ్రహించారు. సోమవారానికి స్టాక్ తెప్పించి మార్కెట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.