ఇరిగేషన్ నిర్వాకం.. ఆయకట్టు రైతులకు శాపం
ఆధునీకరణ పనులు జరిగినా ఊరుముందర కాలువకు పారని నీరు
ఆందోళనలో అన్నదాతలు
రూ.కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.. పొలాలకు సాగునీరు అందుతుందని భావిస్తున్న రైతులు అడియాశలయ్యేలా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోపంతో పనులు జరిగినా రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది.
సోమశిల : అనంతసాగరం మండలంలోని అమానిచిరివెళ్ల చెరువు నుంచి మొదలయ్యే కొమ్మలేరువాగు ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి, బట్టేపాడు వరకు సాగుతుంది. ఈ వాగు పూడికతో నిండిపోవడంతో సుమారు రూ.23 కోట్లతో 2013 సంవత్సరంలో ఆధునీకరణ పనులు ప్రారంభించారు. మండలంలోని రేవూరు సమీపంలో కొమ్మలేరు వాగుకు ఊరుముందర కాలువనే చీలుకాలువ ఉంది. దీని కింద రేవూరు, ఇస్కపల్లి గ్రామాల్లో సుమారు 250 ఎకరాలు సాగులో ఉంది. కొమ్మలేరు వాగు ఆధునీకరణలో ఊరుముందర కాలువకు ఏర్పాటుచేయాల్సిన ఆనకట్ట సక్రమంగా నిర్మాణం చేపట్టకపోవడంతో ఊరుముందర కాలువకు నీళ్లు ఎక్కడంలేదు. ఫలితంగా ఈ కాలువ ఆయకట్టు రైతులు వారి పొలాల్లో పంట వేసుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.