నార్త్‌జోన్ కబడ్డీ పోటీల విజేత పూడిమడక జట్టు
కాకినాడ క్రై ం : కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్ర స్థాయి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ మీట్–2లో భాగంగా జిల్లా క్రీడా మైదానంలో కబడ్డీ పోటీలను కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ డీఎస్పీ ఎం.రాజారావు బుధవారం ప్రారంభించారు. తొలుత ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసంతో పాటూ శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటి వరకూ షెటిల్, సైక్లింగ్, వాలీబాల్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విన్నర్ కాగా, శ్రీకాకుళం జిల్లా బారువా జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు డీఎస్పీ రాజారావు మెమెంటోలు బహూకరించారు. ఈ రెండు జట్లు ఈ నెలలో విశాఖలో జరిగే సెమీఫైనల్‌లో సౌత్ జోన్ విన్నర్, రన్నర్ జట్లతో తలపడతాయన్నారు. ఈ పోటీల్లో నార్త్‌జోన్ డివిజన్‌కు చెందిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 11 మెరైన్ పోలీస్‌స్టేషన్లకు చెందిన 10 జట్లు పాల్గొన్నాయి. పోటీలకు రిఫరీలుగా కాకినాడ సిటీకి చెందిన ఆరుగురు పీఈటీలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, ఓడలరేవు మెరైన్ సీఐలు బి.రాజారావు, శ్రీనివాస్‌లతో పాటు నాలుగు జిల్లాల నుంచి సుమారు 150 మంది మెరైన్ పోలీస్‌లు పాల్గొన్నారు.