
తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు
సింగూర్ ప్రాజెక్టుకు రెండోరోజు పోటెత్తిన జనం
మూడు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు
సీఐతో సహా నలుగురు ఎస్సైలు రంగంలోకి..
పుల్‌కల్: వరదల నేపథ్యంలో సింగూర్‌కు సందర్శకులు రావొద్దని పోలీసులు ముందే హెచ్చరించినా.. ప్రాజెక్టుకు జన తాకడీ తగ్గడం లేదు. ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, జోగిపేట పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు చూసేందుకు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు నుంచి సింగూర్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
అదే సమయంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తిరుగుప్రయాణంలో రోడ్ క్లియరెన్స్‌కు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సందర్శకులను నివారించేందుకు కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో.. పెద్దరెడ్డిపేట చౌరస్తా వద్ద శంకరంపేట ఎస్సై విజయరావు, టేక్మాల్ ఎస్సై ఎల్లాగౌడ్ పర్యవేక్షణలో మరొక చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. అల్లాదుర్గం ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
సోమవారం నుంచి సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రాజక్టు పరిసరాల వద్దకు అనుమతించేది లేదని జోగిపేట సీఐ వెంకటయ్య హెచ్చరించారు. స్థానిక ఎస్సై సింగూర్ గ్రామం నుంచి ప్రాజెక్టు వరకు ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పర్యవేక్షించారు. కాగా, మధ్యాహ్నం పోలీసులు భోజనం చేస్తుండగా.. సందర్శకులు ఒక్కసారిగా ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.
ప్రాజెక్టును సందర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే, చైర్‌పర్సన్
సింగూర్ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో పాటు సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి సందర్శించారు. ఇన్‌ప్లో వివరాలను ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.