ఊరిస్తున్న ‘మోడల్‌’ వసతి | not opened garladinne model school | Sakshi
Sakshi News home page

ఊరిస్తున్న ‘మోడల్‌’ వసతి

Published Fri, Jun 16 2017 10:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ఊరిస్తున్న ‘మోడల్‌’ వసతి

ఊరిస్తున్న ‘మోడల్‌’ వసతి

– అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తున్న ప్రభుత్వం
– ఏటా విద్యార్థులకు తప్పని తిప్పలు
– ఈసారైనా ప్రారంభించేరా?

 
చాలామంది పేద పిల్లలు ప్రతిభ ఉండి సరైన ప్రోత్సహం లేక చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారికోసం ఆంగ్లమాధ్యమంతో కూడిన మోడల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉత్తమ విద్య, అత్యుత్తమ సౌకర్యాలు అంటూ చేసిన ప్రకటనలు నేడు  నీటమూటలయ్యాయి. నాలుగేళ్లు పూర్తయినా కనీస వసతి గృహాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ‘మోడల్‌ చదువు’ ప్రశ్నార్థకంగా మారింది.  ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మోడల్‌ స్కూళ్లు సమస్యలతో సతమతమవుతన్నాయి. వీటి ఏర్పాటు వెనుక లక్ష్యం పాలకుల పుణ్యామా అని నెరవేరే సూచనలు కనిపించడం లేదు.
- అనంతపురం ఎడ్యుకేషన్‌

మోడల్‌ స్కూళ్లలో వసతి ఏర్పాటుపై ప్రభుత్వం వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. 2013–14 విద్యా సంవత్సరంలో ఈ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించినా.. నేటికీ వసతి కల్పించలేకపోయింది. అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తోంది తప్ప ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.

ప్రభుత్వ అలసత్వం..
ఇతర విద్యా సంస్థలకు మోడల్‌గా నిలవాల్సిన ఈæ స్కూళ్లు ప్రభుత్వ అలసత్వం కారణంగా నిర్వీర్యమవుతున్నాయి. 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు అనుకూలించక 2013–14 సంవత్సరానికి వాయిదా వేశారు. ఆ ఏడాది కూడా  తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ప్రభుత్వంలో జవాబుదారీ తనం లోపించడం... నిధుల కొరత కారణంగా తక్కిన మండలాల్లో నేటికీ ఈ స్కూళ్లు ఏర్పాటు కాలేదు.

‘వసతి’ కల్పనలో అంతులేని నిర్లక్ష్యం
ప్రారంభ సంవత్సరంలో హాస్టల్‌ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీ పడి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి వసతి విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆయా మండల పరిధిలో సుదూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, వదిలిపెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి, కనుముక్కల, ఓబుళంపల్లి, వెంకటాంపల్లి, పులేటిపల్లి తదితర గ్రామాల నుంచి వందమంది దాకా విద్యార్థులు రోజూ ఆటోల్లో  స్కూల్‌కు వస్తున్నారు. మోడల్‌ స్కూల్‌ ఉన్న ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి.

ఊరిస్తున్న అధికారులు
వసతి కల్పిస్తామంటూ ఏటా ప్రారంభంలో ప్రకటించడం తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. అన్ని తరగతులకు హాస్టల్‌ వసతి ఉంటుందని చెప్పిన అధికారులు తర్వాత బాలికలకు మాత్రమే అన్నారు. అది కూడా 9 నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న బాలికలకు మాత్రమే కల్పిస్తామని చెప్పుకొచ్చారు. పోనీ అదైనా అమలు చేశారా అంటే లేదు. ప్రతి హాస్టల్‌లోనూ 9 నుంచి ఇంటర్‌ వరకు బాలికలకు వంద సీట్లు కేటాయిస్తామన్నారు. జిల్లాలో 25 స్కూళ్లకు గాను 19 స్కూళ్లలో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. ఒక్కో స్కూల్‌కు రూ. 61 వేలతో వంటపాత్రలు కొనుగోలు చేశారు. గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేశారు. కానీ ఈసారి స్కూళ్లు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా వసతిపై అధికారుల నుంచి స్పష్టత లేదు. ఇదిలా ఉండగా హాస్టళ్లు ప్రారంభించాలంటే ముందుగా మ్యాట్రిన్, చౌకీదారు, హెడ్, హెల్పర్‌ కుకింగ్‌ పోస్టులు భర్తీ చేయాలి. ఇప్పటిదాకా వీటి భర్తీ ప్రక్రియ జరగలేదు.

తొలివిడతగా 19 స్కూళ్లలో ప్రారంభం
తొలివిడతగా  జిల్లాలో 19 స్కూళ్లలో బాలికలకు వసతి కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్లు, నల్లచెరువు,  పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం,  విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాల్లో హాస్టళ్లు ప్రారంభించనున్నారు. అయితే ఇది ఎంత మాత్రం ఆచరణలో ఉంటుందో నమ్మశక్యంగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

ఆటోలో వస్తున్నాం
మా ఊరి నుంచి  ఆదర్శ పాఠశాలకు 12 కిలోమీటర్ల దూరం ఉంది. హస్టల్‌ వసతి లేకపోవడంతో ప్రతిరోజూ ఆటోలో బడికి వెళ్లి వసుం‍్తన్నాం. ఇలా రోజూ తిరగడం వల్ల స్కూల్‌లో చెప్పిన పాఠాలను ఇంటి వద్ద అభ్యసన చేసేందుకు సమయం చాలడం లేదు.  ఇబ్బందిగా ఉంది. హాస్టల్‌ వసతి కల్పిస్తే చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
– అరుణ, పదో​తరగతి మడ్డిపల్లి, పుట్లూరు మండలం

ఈ ఏడాది ప్రారంభిస్తామన్నారు
ఈ సంవత్సరం నుంచి హాస్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. పాఠశాల ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. హాస్టల్‌ లేకపోవడంతో పుట్లూరులోని మా బంధువుల ఇంటిలో ఉంటూ చదువుకోవాల్సి వస్తోంది. హాస్టల్‌ వసతి కల్పిస్తే బాగుంటుంది.
– గంగవైష్ణవి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, తాడిపత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement