ఎన్నాళ్లీ క(న)ష్టాలు
ఎన్నాళ్లీ క(న)ష్టాలు
Published Tue, Nov 22 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
తొలగని చిల్లర ఇక్కట్లు
సామాన్యుల సతమతం
వరి కోతలలకూ దెబ్బ
80 శాతం పనిచేయని ఏటీఎంలు
రూ. జిల్లాకు రూ.600 కోట్లు కావాలని ఇండెంట్
కనీసం రూ.200 కోట్లు వస్తే కొంత సమస్య తీరినట్టే
ఆచరణలోకి రాని పెంట్రోలు బంకుల వద్ద నోట్ల మార్పిడి
రూ.2 వేల నోటున్నా వైద్యం అందక ఓ వ్యక్తి మృతి
ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలోనని భయపడుతున్న జిల్లా ప్రజలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టి పక్షం రోజులు కావస్తున్నా ప్రజల ఇక్కట్లు మాత్రం తీరడం లేదు. బ్యాంకుల వద్ద డబ్బులు లేకపోవడం, ఏటీఎంలు మూసి వేయడంతో బారులు తీరి నిరాశతో వెనుకకు తిరిగిన సందర్భాలే అధికం. ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి. ఆస్తమాతో బాధపడుతున్న ఏజెన్సీకి చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్దామని బయలుదేరాడు. ఆయన వద్ద రూ. 2 వేల నోటుంది. చిల్లర కోసం గంటలతరబడి తిరిగి తీరా చిల్లర చేజిక్కాక ఆసుపత్రికి వెళ్లడానికి బైకుపై వెళ్తుండగా ఆదివారం మధ్యాహ్నం మార్గ మధ్యలోనే తనువు చాలించాడు. ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని జిల్లా ప్రజలు భయపడుతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: పాత రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దుతో గత పదమూడు రోజులుగా జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అవసరమైన మేరకు ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో సరిపడా నగదు లేకపోవడం, బ్యాంకుల్లో నగదు మార్పిడిని క్రమంగా తగ్గించడంతో సమాన్యుల వెతలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ప్రజలకు పంపిణీ చేసిన నగదులో 80 శాతం రూ.2 వేల నోట్లుండడంతో అవి మార్చుకోవడానికి ప్రజలు తిప్పలు పడుతున్నారు. రెండు, మూడు వందలకు కొనుగోలు చేసినా మిగతా చిల్లర మొత్తం రూ.వందల్లో ఇవ్వాల్సి వస్తుండడంతో వ్యాపారులు రూ.రెండు వేల నోట్లు తిరస్కరిస్తున్నారు. దీంతో నిత్యవసర సరుకులు కూడా ప్రజలు కొనుగోలు చేయాలేని పరిస్థితి నెలకొంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వ్యాపారాలు దాదాపు 70 శాతం తగ్గిపోయాయి. తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారులు, బడ్డీకోట్లు వారు 13 రోజులుగా వ్యాపారాలు లేక కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు తమకు రూ.600 కోట్లు కావాలని ఆర్బీఐకు ఇండెంట్ పెట్టాయి. ఇందులో రూ.200 కోట్లు వస్తే నగదు కొరత సమస్య దాదాపు తీరుతుందని లీడ్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరో రూ.50 కోట్లు రూ.100 నోట్లు చెలామణిలోకి వస్తే చిల్లర సమస్య కూడా తీరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.100 నోట్లను పూర్తి స్థాయిలో చెలామణి చేయకుండా భవిష్యత్తు అవసరాలకు దాస్తుండడంతో చిల్లర సమస్య తలెత్తుతోందని పేర్కొంటున్నారు.
ఏటీఎం.. ఎనీ టైం మూత..
నగదు కొరత వల్ల జిల్లాలోని అన్ని ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. 811 ఏటీఎంలకుగాను కేవలం 20 శాతం మాత్రమే పని చేస్తున్నాయి. అన్ని ఏటీఎంలను రూ.రెండు వేల నోట్లకు అనుగుణంగా మార్చకపోవడం వల్ల చిన్న పట్టణాలల్లోని ఏటీఎంలలో రూ.రెండు వేల నోట్లు కూడా లభించడంలేదు.బ్యాంకుల వద్ద, ముఖ్యమైన కూడళ్లలోని ఏటీఎంలలోనే బ్యాంకులు నగదును అందుబాటులో ఉంచుతున్నాయి. రూ.రెండు వేలు, రూ.100 నోట్లు పెడుతుండగా రూ.100 నోట్లు నిమిషాల్లో అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏటీఎంల వద్ద 'నో క్యాష్, రూ.రెండు వేల నోట్లు మాత్రమే' అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ డీలర్ల నుంచి నగదు పంపిణీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించినా ఆ ప్రక్రియ ఇంకా జిల్లాలో ప్రారంభంకాలేదు.
వరి కోతలకు చిల్లర దెబ్బ...
జిల్లాలో వరి ఖరీఫ్ కోతలు మొదలైన పక్షం రోజులు దాటింది..పెద్ద నోట్లు రద్దు.. రూ. 100 నోట్లు లేకపోవడంతో వరి కోతలకు కూలీలు రావడంలేదు. చిల్లర నోట్లు ఇస్తామంటేనే కోతలకు వస్తామని ముందుగానే తెల్చి చెబుతున్నారు. దీంతో కోతలు ఆలస్యమై పంటకు దోమ పడుతోంది. అనుకున్న సమయానికి కోతలు పూర్తి చేయకపోతుండడంతో గింజలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీఈపీడీసీఎల్‌లో ప్రజలకు పాత నోట్లు...
విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు సిబ్బంది చిల్లర లేదని పాత రూ.500 నోట్లు ఇస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఇంజినీర్ ఎ.అప్పారావు సోమవారం ఈపీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రంలో రూ.1,388 బిల్లునకు రూ.2000 నోటు ఇచ్చారు. అయితే బిల్లు కట్టిన తర్వాత పాత రూ.500 నోటు రూ.100 నోట్లు ఇస్తున్నారు. పాత నోటు ఇస్తున్నారేంటని అప్పారావు అడగ్గా సిబ్బంది దురుసుగా మాట్లాడారని ఆయన వాపోయారు. ఈ విషయమై 'సాక్షి' ఏపీఈపీడీసీఎల్ అకౌంట్ ఆఫీసర్ ఆదినారాయణతో మాట్లాడగా.. చిల్లర లేక అలా ఇచ్చి ఉండవచ్చని, తగినంత చిల్లర లేకపోతే మొత్తం నగదుకు బిల్లు చేసే విధంగా సిబ్బందికి ఆదేశాలిస్తామని చెప్పారు. రూ.500 నోటు తీసుకున్న వ్యక్తి మంగళవారం కార్యాలయానికి వస్తే రూ.100 నోట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
Advertisement