రైల్వే స్థలాల్లో ఆక్రమణల తొలగింపు
కంచిలి : మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ స్థలంలో ఉన్న ఆక్రమణలను రైల్వే అధికారులు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొలగింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి రైల్వేస్టేషన్‌కు రెండు వైపులా గోడకు ఆనించి, స్టేషన్ సమీపంలోనూ చాలా మంది పేదలు ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఇటీవల కొందరు పక్కా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు శనివారం ఆకస్మికంగా తొలగింపు చర్యలు చేపట్టారు.
ముందస్తు నోటీసులు గానీ, సమాచారం గానీ ఇవ్వకుండా పూర్తి ఫోర్స్‌తో పకడ్బందీగా వచ్చి అక్రమ కట్టడాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా ఎనిమిది ఆక్రమణలను ఈ దశలో తొలగించారు. మిగతా వాటిని దశలవారీగా తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఆక్రమణల్లో కొందరు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అటువంటి నిర్మాణాల జోలికి, పాత నిర్మాణాల జోలికి వెళ్లలేదు. చిన్న బడ్డీలను కూడా వదిలేశారు. త్వరలో వీటిపైనా చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ స్థలంలో ఎవరూ పక్కా నిర్మాణాలు చేపట్టవద్దని సంబంధిత వర్గాలు ఎప్పటి నుంచో సూచిస్తున్నాయి.
తాజాగా ఈ చర్యతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. రైల్వే స్థలాల్లో చాలా మంది చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని పొట్టనింపుకొంటున్నారు. మరికొందరు సొంత స్థలాలు లేక ఎప్పటి నుంచో షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. ప్రస్తుత పరిణామంతో ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆక్రమణల తొలగింపును రైల్వే ఎస్‌ఎస్‌ఈ వి.కిశోర్‌కుమార్, ఆర్‌పీఎఫ్ సీఐ దిలీప్‌కుమార్‌ల నేతృత్వంలో చేపట్టారు. జేఈలు శివపాత్రో, పాపారావు, ఏఎస్‌ఐ బి.రావు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.