ఆయిల్ ఇండియా పనులకు ఆటంకం
-
డిమాండ్లు పరిష్కరించాలన్న కర్రివాని చెరువు గ్రామస్తులు
-
డ్రిల్లింగ్ సైట్ వద్ద పిల్లాపాపలతో వంటా వార్పు
-
అధికారుల హామీతో సమసిన ఆందోళన
ముమ్మిడివరం :
మండలంలోని గాడిలంక ఆయిల్ ఇండియా సంస్థ చేపట్టిన డ్రిల్లింగ్ పనులను మంగళవారం కర్రివాని రేవు గ్రామస్తులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని డ్రిల్లింగ్ సైట్ మెయిన్ గేట్ వద్ద టెంట్ వేసి రిలే దీక్షలు చేపట్టారు. పిల్లా పాపలతో మహిళలు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. సైట్ సమీప గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కాలుష్య నియంత్రణ చర్యలు గాని, అనుమతులు గాని లేకుండా డ్రిల్లింగ్ చేస్తున్నారన్నారు. డ్రిల్లింగ్ పాయింట్‌కు కేవలం 300 మీటర్ల సమీపంలో కర్రివానిరేవు గ్రామంలో 1997లో నిరుపేదలకు ఏఎంజీ సంస్థ నిర్మించిన గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి సామర్థ్యాన్ని ఇంజనీర్ల చేత నిర్ధారించాలని లేకపోతే డ్రిల్లింగ్ పనుల వల్ల ఆవి కూలిపోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 9నెలల క్రితం ఆయిల్ ఇండియా ప్రతినిధులు సైట్ నుంచి పెన్నాడ పాలెం వరకు 1350 మీటర్ల కెనాల్ రోడ్డును బీటీ రోడ్డుగా ఆధునికీకరిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. డ్రిల్లింగ్ వల్ల నష్టపోతున్న గాడిలంక, కర్రివాని రేవు గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు ఏర్పాటుచేయాలని, ప్రధాన పంట కాలువ వెంబడి రక్షణ గోడ నిర్మించాలని, ఆయా గ్రామాల పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, నెలనెలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్ల నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఎం.వీర్రాజు, ముమ్మిడివరం, కాట్రేనికోన ఎస్సైలు ఎం.అప్పలనాయుడు, షేక్‌జాన్‌బాషా ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించినా ఆందోళనకారులు ససేమిరా అంటూ ఆర్డీఓ వచ్చి లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఆందోళనకారులతో సైట్ ఇంజనీర్ శ్యామలరావు, సీఐ కేటీవీవీ రమణారావు, ఎస్సై అప్పలనాయుడు రెండు నెలల్లో రహదారి ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని, మిగిలిన పనులు రిగ్ పనులు మొదలయ్యాకా దశలవారీగా పూర్తిచేసేందుకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. చర్చల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి పాల్గొన్నారు.అంతకు ముందు ఆందోళనలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, నాయకులు చింతా వెంకటరమణ,కాశి రామకృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గ్రామస్తుల డిమండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని పితాని కర్రివాని రేవు సర్పంచ్ చింతా వెంకటరమణ, గాడిలంక సర్పంచ్ దానం వేణుగోపాలస్వామి, ఎంపీటీసీ ఓలేటి సత్యవతి, మాజీ సర్పంచ్‌లు మోర్త వీరశూర్జ్యం తదితరులు పాల్గొన్నారు.