
మృత్యువుకూ కరుణలేదాయె..
కొడుకు మరణం కుంగదీసింది. వృద్ధాప్యం బాధలు వేధిస్తున్నాయి. మంచంపట్టిన భార్యకు సేవలు చేయలేని పరిస్థితి.
ఓ వృద్ధుడి ఆవేదన
సత్తెనపల్లి: కొడుకు మరణం కుంగదీసింది. వృద్ధాప్యం బాధలు వేధిస్తున్నాయి. మంచంపట్టిన భార్యకు సేవలు చేయలేని పరిస్థితి. అయినవారి సూటిపోటి మాటలు ఇంకెందుకు బతుకు అనేలా చేశాయి. దీంతో తనను కరుణించని మృత్యువుని తానే కౌగిలించుకోవాలని ప్రయత్నించాడో వృద్ధుడు. ఆత్మహత్య చేసుకుందామని రైలుకు ఎదురెళ్లినా చిన్న పాటి గాయాలతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చాడు.
గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు.. సత్తెనపల్లి లెనిన్‌నగర్‌కు చెందిన శ్యామల సాంబిరెడ్డి (80) కొంతకాలం ఆ ప్రాంతంలోని ఓ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేశాడు. 11 ఏళ్ల క్రితం కుమారుడు శ్రీనివాసరెడ్డి కామెర్లతో మృతిచెందాడు. కొంతకాలం క్రితం వరకూ సాంబిరెడ్డి, ఆయన భార్య సీతామహాలక్ష్మిని కోడలు చూసేది. అయితే అక్కడి మాటలను భరించలేక ఆ వృద్ధ జంట వేరేగా ఉంటోంది.
ఈలోగా సాంబిరెడ్డి భార్య పక్షవాతంతో మంచాన పడింది. భార్యకు సేవలు చేయాల్సిన తాను ఆమెకే భారమయ్యాను అనుకొని, కష్టాల నుంచి శాశ్వత విముక్తి పొందాలని సాంబిరెడ్డి ప్రయత్నించాడు. దీంతో బుధవారం రాత్రి గుంటూరు-మాచర్ల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ రైలు తన మీద నుంచి వెళ్లినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. తనపై నుంచి రైలు వెళుతున్నపుడు చనిపోయాననే అనుకున్నానని సాంబిరెడ్డి చెప్పాడు. కాలికి గాయంతో బయటపడ్డ ఆయన్ని స్థానికులు ఆస్పత్రికి చేర్చారు.