బెంకిలి పంటపొలాల్లో బుధవారం పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. మరొక మహిళ తీవ్రంగా గాయపడింది.
సోంపేట: మండలంలోని బెంకిలి పంటపొలాల్లో బుధవారం పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. మరొక మహిళ తీవ్రంగా గాయపడింది. జింకిభద్ర గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రంగోయి జానకమ్మ(47), తాళ్ల హేమావతి వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగివస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన జోరువాన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పిడుగు పడటంతో జానకమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. హేమావతి అనే మహిళ తీవ్రంగా గాయపడింది.
వెంటనే స్పందించిన స్థానికులు ఈమెను సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జానకమ్మ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటోంది. ఆమె మృతితో కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు. ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ ఆర్.గోపాలరత్నం, ఎస్‌ఐ కె.భాస్కరరావులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమావతి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.