బతుకంతా పచ్చగా.. | pacha saale for orphans and poor students | Sakshi
Sakshi News home page

బతుకంతా పచ్చగా..

Published Sun, Apr 3 2016 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

బతుకంతా పచ్చగా..

బతుకంతా పచ్చగా..

పచ్చసాలె... బతుకంతా పచ్చగానే. ఈ సాలె ఎంతోమందిని ప్రయోజకులను చేస్తోంది. బతుకునిస్తోంది. భవిష్యత్తును బంగారుమయం చేస్తోంది.

ఈ బడిలో అనాథలు, నిరుపేదలకు అవకాశం
చదువుతోపాటు వృత్తి పనుల్లో శిక్షణ
ఆటపాటలు, కథలు, మాటలతో బోధన
ఎంతోమందికి దారిచూపిన పచ్చసాలె
డీడీఎస్ ఆధ్వర్యంలో మాచునూర్‌లో పాఠశాల
23 ఏళ్లుగా నిరుపేద పిల్లలకు సేవలు

 పచ్చసాలె... బతుకంతా పచ్చగానే. ఈ సాలె ఎంతోమందిని ప్రయోజకులను చేస్తోంది. బతుకునిస్తోంది. భవిష్యత్తును బంగారుమయం చేస్తోంది. అనాథలు, నిరుపేదలు, బడికి దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుకుంటోంది. ఓవైపు చదువు నేర్పిస్తూనే వృత్తి పనుల్లో శిక్షణనిస్తోంది. పదోతరగతి పూర్తయ్యే సరికి వారు పలు వృత్తుల్లో నైపుణ్యాన్ని ఆర్జిస్తున్నారు. బయటకు వచ్చిన తరువాత వీలైతే ఉన్నత చదువులు లేదా నేర్చుకున్న పనితో ఉపాధి పొందుతున్నారు. ఇలా ఎంతోమంది జీవితంలో స్థిరపడ్డారు. డీడీఎస్ ఆధ్వర్యంలో మాచునూర్‌లో 23 ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఈ పచ్చసాలెలో అన్నీ ఉచితమే. ఇక్కడ చేరిన వారికి హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. అదీగాక ఆటపాటలు, మాటలు, కథలుఅన్నీ నేర్పుతారు. పిల్లల్ని సమాజానికి పనికొచ్చేలా తీర్చిదిద్దుతోన్న పచ్చసాలెపై ఆదివారం ప్రత్యేక కథనం...       - జహీరాబాద్

 జహీరాబాద్: చదువుకు దూరంగా ఉన్న వారిని దరి చేర్చుకుంటోంది పచ్చసాలె. చదువుతోపాటే పలు వృత్తి పనుల్లో శిక్షణనిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతోంది. ఆర్థిక సమస్యల కారణంగా చదువుకునే అవకాశంలేని పిల్లలు, అనాథల పిల్లలు చదువుకునేందుకు వీలుగా డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) 1993లో ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామంలో ‘పచ్చసాలె’ పేరుతో పాఠశాలను ప్రారంభిం చింది. ఈ సాలె 1993నుంచి 2000వరకు కేంద్రమానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో నడిచింది. 2001 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం తో అప్పటినుంచి డీడీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

 ఐదేళ్లలో పదోతరగతికి సన్నద్ధం..
చదువుకు దూరంగా ఉండి, మధ్యలోనే బడి మానిన వారిని ‘పచ్చసాలె’లో చేర్చుకుంటారు. వారిని ఐదేళ్ల కాలంలోనే పదోతరగతి పరీక్ష రాసేలా సిద్ధం చేస్తారు. చదువుతోపాటు జీవనోపాధినిచ్చే పనులు నేర్పుతారు. టైలరింగ్, బుక్ బైండింగ్, సేంద్రియ వ్యవసాయం, చెట్ల మందుల తయారీ, వడ్రంగి, కుమ్మరి పనుల్లో శిక్షణ ఇస్తారు. గత రెండేళ్ల నుంచి కంప్యూటర్, వీడియోగ్రఫీలోనూ తర్ఫీదునిస్తున్నారు.

 తరగతి గదులకు పక్షుల పేర్లు..
పచ్చసాలెలో ప్రతీది వినూత్నం. ఒక్కోతరగతి గది ఒక్కో పక్షి పేరుతో పిలుస్తారు. పిచ్చుక, చిలుక, పావురం, కోకిల, పాలపిట్ట, చకుముకి, నెమలి, గోరింక వంటి పేర్లు పెట్టారు. చదువుమాని 10-12 ఏళ్ల వయస్సు పిల్లలు చిన్నతరగతి చదువుతున్నామనే బాధ కలగకూడదనే భావనతో వాటికి పక్షుల పేర్లు పెట్టారు.

 పిచ్చుక గూళ్లను తలపించే గదులు
పచ్చసాలె ఆవరణలోని తరగతి గదులను పిచ్చుక గూళ్ల ఆకారంలో నిర్మించారు. 13 గదులకుగాను ఆరు తరగతి గదులు, మూడు గదుల్లో స్టోర్, లైబ్రరీ, ఆడిటోరియాలు నిర్వహిస్తున్నారు. ఆరు గదులు వర్క్‌షాప్‌లకు వినియోగిస్తున్నారు. విద్యార్థులను గదుల్లో గుండ్రంగా కూర్చోబెడతారు. ఉపాధ్యాయులు మధ్యలో నిలబడి పాఠాలు బోధిస్తారు. ఉపాధ్యాయుడికి ప్రతి విద్యార్థి కనిపించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు.

 ఆటలు, పాటలు, కథలు..
విద్యార్థులకు చదువు, ఉపాధి పనులే కాదు. ఆటపాటలు, కథలు కూడా నేర్పుతారు. ప్రతి సోమవారం కొత్త పాటలు, మంగళవారం ఆటలు, బుధవారం కథలు, గురువారం కొత్త మాటలు, శుక్రవారం స్థానిక వార్తలు, విశేషాలు చెబుతారు. విద్యార్థులు ఆ వారంలో నేర్చుకున్న విషయాలను శనివారం తెలియజేయాల్సి ఉంటుంది.

 హాస్టల్ సదుపాయం
దూరప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించారు. 59 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటున్నారు. డీడీఎస్ తరఫున మూడు పూటల భోజనం అందిస్తున్నారు. పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. ఇప్పటివరకు 163 మంది పదోతరగతి పరీక్షలు రా యగా, 137మంది ఉత్తీర్ణుల య్యారు. ఇందులో కొందరు ఉన్నత చదువులు చదువుతుండ గా, మరికొందరు పోలీసు, నర్సు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే పాఠశాలలో చదివిన చిన్న నర్సమ్మ, జనరల్ నర్సమ్మలు మాచునూర్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ నిర్వహిస్తున్నారు. పలువురు చేతి వృత్తి పనులను నేర్చుకుని పలు ప్రాంతాల్లో మేస్త్రీ, వండ్రంగి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.

 చదువుకోవాలనే తపనతో వచ్చా..
కోహీర్ మండలం పిచరాగడి తండాలో నాల్గోతరగతి వరకు చదువుకున్నా. పైతరగతుల కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిచరాగడి గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో నాకు బడికి పంపక చదువు మాన్పిం చారు. నాకు చదువుకోవాలనే ఆసక్తి ఉండడంతో పచ్చసాలెలో చేరి చదువుకుంటున్నా. ఇక్కడే చదువుకుని పదోతరగతి పరీక్ష రాసి ఉన్నత చదువులను కూడా పూర్తిచేస్తా.
- బల్‌రాం, విద్యార్థి, పిచరాగడి తండా

పిల్లల కోసం లంబాడా భాష నేర్చుకున్నా..
పచ్చ సాలెలో చేరిన వారిలో ఎక్కువగా తండాలకు చెందిన గిరిజనులే అధికంగా ఉన్నారు. వారికి లంబాడా భాషనే ఎక్కువగా వస్తుంది. దీంతో వారి భాషను నేర్చుకోవడం ద్వారా తగిన న్యాయం చేస్తామనే ఉద్దేశంతో నేను కూడా వారి ద్వారా ఆ భాష నేర్చుకున్నా. చిన్న పిల్లలకు వారి భాషలో మాట్లాడుతూ చదువు నేర్పుతున్నా.  - సుగుణలక్ష్మి, ఉపాధ్యాయురాలు

 సదువుకుని రేడియో స్టేషన్ నిర్వహిస్తున్న..
నేను చిన్నప్పుడు అమ్మ రంగమ్మతో కలిసి కూలీ పనికి పోతుంటి. నాకు పదేళ్లు వచ్చేవరకు సదువంటే తెల్వదు. మా ఊరులో డీడీఎస్ వాళ్లు జాతర పెట్టిండ్రు. గా జాతర సూసేందుకు నేను కూడా పోయిన. జాతర్ల నా అసువంటి పిల్లలు అటు, ఇటు తిరిగుతూ ఆటలాడిండ్రు. నాకు కూడా ఆటలాడాలనిపించింది. అక్కడ ఉన్న డీడీఎస్ సారూ దగ్గరకు పిలిసి సాలెకు పోతున్నవా? అని అడిగిండు. పోతలేనని చెప్పిన. సదువు కుంటవా అని అడిగిండు. ఇంత పెద్దగా ఉన్న నేను ఒకటవ తరగతిలో ఎట్ల కూసోవాలే సారూ అని జవాబు చెప్పిన. నీలాక పెద్దగా ఉన్న వాళ్ల కోసం సాలెలు ఉన్నాయని, అక్కడ సదువు కోవచ్చని చెప్పిండు. నేను సదువు కుంటానని చెప్పిన. డీడీఎస్ నడుపుతున్న సాలెలో చేరి 8ఏళ్లు సదువుకున్న. పదోతరగతి పాసైన. ఇప్పుడు మాచ్‌నూరులో ఉన్న సంఘం రేడియో స్టేషన్ నడుపుతున్న. పచ్చసాలె నాకు ఒక దారి చూపింది.  - జనరల్ నర్సమ్మ, పస్తాపూర్

 కూలీ పనుల నుంచి విముక్తి..
కూలీ పనులకు వెళ్లేదాన్ని. 11 ఏళ్ల వయస్సులో మాచునూర్‌లో డీడీఎస్ నడుపుతున్న పచ్చసాలెలో చేరిన. అక్కడ ఐదేండ్లు సదువుకుని పదోతరగతి పరీక్ష రాసి పాసైన. అక్కడే ఉన్న రేడియో స్టేషన్‌లో ప్రసారం చేసే కార్యక్రమాలు రూపొందిస్తున్నా. ఆయా కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తున్నా. పచ్చసాలెలో చదువుకోవడం వల్ల నాకు ఓ దారి దొరికింది.  - నర్సమ్మ, అల్గోల్

 మేస్త్రీ పనితో ఉపాధి పొందుతున్న..
చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లలేదు. తర్వాత చదువుకోవాలనిపించి మాచ్‌నూర్‌లోని పచ్చసాలెలో చేరి చదువుకున్న. అక్కడ మేస్త్రీ పనిలో శిక్షణ పొందా. పదోతరగతి వరకు చదువుకున్న. నేను మేస్త్రీ పని చేసుకుని ఉపాధి పొందుతున్నా. ఈ పనిలో శిక్షణ పొందినందునే ఉపాధి దొరికింది.  - రాజు, రంజోల్

 చదువు బతుకు మార్గం చూపింది..
పచ్చసాలెలో చేరి చదువునేర్చుకోవడం వల్ల ఒక దారి దొరికింది. అక్కడ మేస్త్రీ పనిలో శిక్షణ పొందినందునే బయట పనులు చేసుకోగలుగుతున్నా. అంతేకాకుండా పదోతరగతి వరకు చదువుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు మేస్త్రీ పనితో ఉపాధి పొంది కుటుంబాన్ని పోషిస్తున్నా.  - కుమార్, మామిడ్గి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement