పనుల పితలాటకం
Published Tue, Apr 25 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘పోలవరం పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయ్. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. 2018 నాటికి నీటిని విడుదల చేస్తాం’ ఈనెల 17న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఇది. ఆయన వచ్చి వెళ్లిన వారం రోజుల్లోనే అక్కడ పనులు నిలిచిపోవడం చర్చనీయాంశమైంది. ఆ రోజున అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ తీరుపై సబ్ కాంట్రాక్టర్లు ధ్వజమెత్తారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోతే పనులు చేయడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఎస్క్రో ఖాతా తెరిపించి నిధులను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది అమలు కాకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మట్టి తవ్వకం పనులు (ఎర్త్ వర్క్) చేస్తున్న త్రివేణి సంస్థకు ట్రాన్స్‌ట్రాయ్ నుంచి రూ.350 కోట్ల మేర బకాయి ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా ట్రాన్స్‌ట్రాయ్ యాజమాన్యం సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడంతో వాళ్లు పనులు నిలిపివేశారు. 10 రోజుల క్రితం త్రివేణి సంస్థకు చెందిన ఎక్స్‌కవేటర్ దగ్ధమై రూ.30 కోట్ల వరకూ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీనికి ఇన్సూరె¯Œ్స ఉందని, దానిని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని, జర్మనీ నుంచి సాంకేతిక బృందం వచ్చి మరమ్మతులు చేయడానికి మూడు నెలలు పడుతుందని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయిన తీరు, ప్రధాన కాంట్రాక్టర్‌తో విభేదాలు తలెత్తడాన్ని చూస్తుంటే ఆ రోజున జరిగింది ప్రమాదమా లేక కావాలని అగ్నిప్రమాదం సృష్టించారా అన్న అనుమానాలను ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సుమారు రూ.60 కోట్ల విలువైన యంత్రంలో అగ్ని నిరోధక వ్యవస్థ ఉండదా.. కేవలం ఎండ వేడికే అది తగలబడిపోతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రధాన సబ్ కాంట్రాక్ట్ సంస్థ త్రివేణి ఆదివారం నుంచి పనులు నిలిపివేయగా.. ఆ సంస్థ ఆధ్వర్యంలోని చిన్నపాటి కాంట్రాక్టర్లు కూడా సోమవారం నుంచి పనులు నిలిపివేశారు. దీంతో ప్రాజెక్ట్ ప్రాంతంలో మట్టి తవ్వకం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్కరోజు ప్రాజెక్ట్‌లో పనులు నిలిచిపోతే రూ.21 కోట్లు నష్టం వస్తుందంటున్న ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఇంకా స్పందించ లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుత వివాదాలను చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సకాలంలో పూర్తువుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Advertisement
Advertisement