‘విభజన’ వినతులు
- మిగిలింది మూడు రోజులే..
- వెబ్‌సైట్‌కు 1,408 దరఖాస్తులు
- రెవెన్యూ డివిజన్లు చేయాలని ఆందోళనలు
- కొత్త మండలాలపై పెరుగుతున్న డిమాండ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వినతుల స్వీకరణకు ఈనెల 20వ తేదీ వరకు గడువుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి వెబ్‌సైట్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటుపై స్థానికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు 1,408 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 23వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. దీంట్లో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై వివరాలు ఉంచింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో విన్నవించుకోవచ్చని పేర్కొంది. అయితే జిల్లాల ఏర్పాటు అంశం అలా ఉంచితే.. కొత్త మండలాల ఏర్పాటుపై అధికారులు పేర్కొన్న నివేదికలో మండలాలు లేకపోవడంతో స్థానికంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా వివాదాస్పదంగా మారింది. దీంతో మొదటి రోజు నుంచే వెబ్‌సైట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విడుదల చేసింది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కావడంతో.. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం విడుదల చేసే తుది నోటిఫికేషన్‌లో ఈ అంశాలన్నింటిపై చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
మండలాల ప్రకటనపై ఎదురుచూపు
కొత్తగూడెం జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలు, ఖమ్మం జిల్లాలో ఒక మండలం కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో మాత్రం ఖమ్మం జిల్లాలో గతంలో ప్రకటించిన రఘునాధపాలెంను మాత్రమే పేర్కొనడంతో రాజకీయ నాయకుల నుంచి స్థానికుల వరకు నిరాశ చెందారు. కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, గుండాల మండలంలో ఆళ్లపల్లి, పినపాక మండలంలో కరకగూడెం మండలాలు ఏర్పాటు చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. దీనిపై ప్రభుత్వానికి వినతులు ఎక్కువగా వెళ్లాయి. నోటిఫికేషన్ తర్వాత వివిధ సందర్భాల్లో సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్ మండలాల ఏర్పాటుపై కూడా చర్చించారు. పినపాక మండలంలో కరకగూడెం, గుండాల మండలంలో ఆళ్లపల్లి మండలాలను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారని స్థానికులు భావిస్తున్నారు. జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలని స్థానికులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రదర్శనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జూలూరుపాడుకు కొత్తగూడెం 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అదే ఖమ్మం 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తమను కొత్తగూడెం జిల్లాలో కలపాలని జూలూరుపాడులో ఆందోళనలు చేపట్టారు.
రెవెన్యూ డివిజన్లపై ఉధృతంగా ఆందోళనలు
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఖమ్మం జిల్లాలో కొత్తగా వైరా రెవెన్యూ డివిజన్‌ను పేర్కొనడంతోపాటు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లుగా పేర్కొన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో గతంలోనే కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ క్రమంలో కల్లూరు కేంద్రంగానే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడ ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. మరికొందరు సత్తుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా ఆందోళనలు చేపట్టారు. రెవెన్యూ డివిజన్ అంశంపై కూడా సీఎం కేసీఆర్ సమీక్షలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. దీంతో నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగానే వైరా కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని.. వైరాలో ఆందోళనలు, నిరసన దీక్షలు మొదలయ్యాయి. అలాగే మధిరను కూడా రెవెన్యూ డివిజన్ చేయాలనే ఆందోళనలు మిన్నంటాయి. బంద్‌లు, దీక్షలతో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
వెబ్‌సైట్‌కు వచ్చిన వినతుల వివరాలు ఇలా..
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
జిల్లాల ఏర్పాటుపై రెవెన్యూ డివిజన్లపై మండలాలపై
ఖమ్మం 363 336 88
కొత్తగూడెం 459 55 107
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మెుత్తం 822 391 195
(రెండు జిల్లాలకు కలిపి వచ్చిన అన్ని వినతులు 1,408)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––