వైద్య చికిత్సలో ‘పెథాలజీ’ పాత్ర కీలకం
– ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు
అనంతపురం మెడికల్ : రోగికి వైద్య చికిత్స అందించడంలో ‘పెథాలజీ’ వైద్యుల పాత్ర కీలకమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి నిరంతర వైద్య విద్య (సీఎంఈ) సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అప్పలనాయుడు మాట్లాడుతూ రోగ నిర్ధారణలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందరూ అందిపుచ్చుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అధ్యాపకులు, పీజీ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెథాలజీ వైద్యులను ఒకచోట చేర్చి సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై పెథాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ మైరెడ్డి నీరజను అభినందించారు.
అనంతరం శాంతిరాం మెడికల్ కళాశాల పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ జానకి, గ్రాంట్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల (ముంబయ్) హెచ్‌ఓడీ డాక్టర్ లాన్జీవర్, ఎంవీజే మెడికల్ కళాశాల (బెంగళూరు) పెథాలజీ హెచ్‌ఓడీ షమీమ్‌షరీఫ్, రాయల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెథాలజిస్ట్ అన్నపూర్ణ, ఎంఎస్ రామయ్య మెడికల్ కళాశాల గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అవినాశ్ ప్రసంగించారు. కాలేయ, క్లోమ సంబంధిత వ్యాధుల నిర్ధారణలో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పెథాలజీ అండ్ మైక్రో బయాలజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సైలాబాను, సెక్రెటరీ శ్రీకాంత్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ కేశన్న, విశ్రాంత సూపరింటెండెంట్లు రామసుబ్బయ్య, అక్బర్‌సాహెబ్, ఐఎంఏ అధ్యక్షుడు కొండయ్య, కార్యదర్శి వినయ్, కోశాధికారి మనోరంజన్‌రెడ్డి, పెథాలజిస్ట్‌లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.