మూగజీవాల మృత్యువాత
► మండుతున్న ఎండలతో కరువైన తాగునీరుl
► ప్రమాదకరంగా మారిన పశుపక్ష్యాదుల మనుగడ
► రక్షణ చర్యలు చేపట్టని అటవీశాఖ అధికారులు
మంచాల(ఇబ్రహీంపట్నం): ఎండల తీవ్రతకు మనుషులే కాదు మూగజీవాలు సైతం ఉక్కిబిక్కిరవుతున్నాయి. అడవుల్లో వాటి మనుగడ కష్టంగా మారింది. మేతతోపాటు చుక్క నీరు కూడా దొరక్కపోవడంతో మృత్యువాత పడుతున్నాయి. మండలంలోని నోముల, ఆగాపల్లి, రంగాపూర్, చీదేడ్, దాద్‌పల్లి, ఆరుట్ల, మంచాల, జాపాల, గున్‌గల్, నల్లవెల్లి అటవీ ప్రాంతాల్లో నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు అధికంగా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 142.2 మి.మీ. వర్షపాతం నమోదయింది. తిరిగి మళ్లీ వర్షాల జాడే లేకుండాపోయింది.
ఇటీవల గాలులతో కూడి వర్షం కురిసినా ఎక్కడా నీరు నిల్వలేదు. అడవుల్లో ఉన్న చెరువులు , కుంటలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో పశుపక్ష్యాదులకు తాగునీటి తీవ్రత నెలకొంది. అధిక ఎండలతో పక్షులు భారీగా చనిపోతున్నాయి. వీటి రక్షణకు అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ప్రధానంగా జాతీయ పక్షులు నెమళ్లు నీరు దొరక్కపోవడంతో వడ దెబ్బకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల లింగంపల్లి గేట్ వద్ద ఓ నెమలి చనిపోయింది. ఇటీవల జాపాల అడవిలో నెమళ్లు మృత్యువాతకు గురయ్యాయి. అడవుల్లో మూగజీవులు చనిపోతున్నాయని, వాటినిని కాపాడుకోవల్సిన బాధ్యత అటవీ అధికారులు గుర్తెరగాలని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆగాపల్లి, పెద్దతుండ్ల వంటి అటవీ ప్రాంతాల్లో జంతువులకు తాగునీటి కోసం కుండీలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క రోజు కూడా వాటిలో నీళ్లు పోసిన పాపాన పోలేదు. ఎండలు మండుతున్నాయి.. గ్రామాల్లో పశువులకు, అడవుల్లో జంతువులకు తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఇటీవల నిర్వహించిన మంచాల మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆ సమయంలో సరేనన్న అటవీ అధికారులు మరుసటి రోజు ఆ విషయమే మరిచారు.
రోజుకో చోట నెమలి నేల రాలుతున్నా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలు ఫిర్యాదు చేసినా మూగజీవాల రక్షణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు మూగజీవాలకు అడవుల్లో తాగునీటి సదుపాయం కల్పించి వాటి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.