మెంటాడ(సాలూరు): గతంలో సర్వం కోల్పోయిన అగ్నిబాధితులకు తాత్కాలికంగా నివాసం కోసం రూ. 15 వేలు అందించామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అగ్నిబాధితులకు రూ.4,200 ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమంటే పేదల ప్రభుత్వం ఇదేనా అని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర విస్మయం వ్యక్తం చేశారు. మండలంలోని జక్కువ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించడానికి బుధవారం జక్కువ వచ్చిన ఎమ్మెల్యే రాజన్నదొర స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాది పేదల, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు పాలనలో సంక్రాంతి పండగ చేసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని విమర్శించారు. గతంలో కొంపంగి, మీసాలపేటలలో అగ్ని ప్రమాదాలు జరిగితే తమ హయాంలో ఒక్కో బాధితునికి రూ.15 వేల ఇస్తూ, వెంటనే వారికి ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. కొంపంగిలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఐఏవై కింద ఏడుగురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేసినప్పటికీ నేటి వరకూ బిల్లులు చెల్లించలేదన్నారు.
కలెక్టర్ ఆదేశాలను కూడా పక్కనపెట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారికి బిల్లులు రాకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. జక్కువలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా కలెక్టర్, మండల స్థాయి అధికారులు కనీసం పట్టించుకోలేదని, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయం నేటి వరకూ అందజేయలేదని ఆయన ఆరోపించారు. తక్షణమే కొంపంగి, జక్కువ, కూనేరు గ్రామాలలో జరిగిన అగ్ని ప్రమాదాల బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు, సిరిపురపు తిరుపతి, యువజన అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాయి అప్పారావు, మరడ సింహాచలం, దాట్ల హనుమంతురాజు, నాయకులు లచ్చిరెడ్డి ఈశ్వర్రావు, లచ్చిరెడ్డి అప్పలనాయుడు, కుపురెడ్డి మోహనరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదేనా పేదల ప్రభుత్వం?
Published Thu, Jan 12 2017 4:09 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
Advertisement