కాంగ్రెస్‌ను ప్రజలు బహిష్కరించారు
ఖేడ్‌లోనూ భంగపాటు తప్పదు: హరీశ్
నారాయణఖేడ్: జీహెచ్‌ఎంసీ, వరంగల్‌లో కాం గ్రెస్, టీడీపీలను ప్రజలు బహిష్కరించారని, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బహిష్కరిస్తారని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి, గంగాపూర్, ర్యాకల్ గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా కాంగ్రెస్ ఎక్కడుందని, వరంగల్‌లో ప్రజలు ఎప్పుడో చిత్తుగా ఓడించారన్నారు. జీహెచ్‌ఎంసీ పోలింగ్ సరళి, సర్వే ఫలితాలు పత్రికల్లో వచ్చాయని, అక్కడా టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
హైదరాబాద్ ప్రజలు, వరంగల్ ప్రజలు కాంగ్రెస్‌ను బహిష్కరించాక నారాయణఖేడ్‌లో మనమెందుకు బహిష్కరించకూడదని ప్రజలతో అన్నారు. ఖేడ్‌లో కాంగ్రెస్ నాయకులు మొసలికన్నీరు కార్చేందుకు రానున్నారని, మొసలి కన్నీరు కావాలో, ఇంట్లో తాగేందుకు నీళ్లు కావాలో తేల్చుకోవాలన్నారు. తాను జిల్లాకు చెందిన మంత్రినని, ఈ ప్రాంతం అభివృద్ధి బాధ్యత తనపై ఉందన్నారు. వారానికోసారి తాను ఖేడ్ వస్తానన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి అలా రాగలడా?, ఎన్నికలయ్యాక నల్లగొండలో ఉంటాడని ఎద్దేవా చేశారు. ప్రచార కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అభ్యర్థి భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.