వినాయక పందిళ్లకు అనుమతి తప్పనిసరి | permission must for vinayaka canopy | Sakshi
Sakshi News home page

వినాయక పందిళ్లకు అనుమతి తప్పనిసరి

Published Tue, Aug 30 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

వినాయక పందిళ్లకు  అనుమతి తప్పనిసరి

వినాయక పందిళ్లకు అనుమతి తప్పనిసరి

నిబంధనలను జారీచేసిన విజయవాడ సీపీ 
విజయవాడ : 
వచ్చేనెల 5వ తేదీన జరగనున్న వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో పందిళ్లు, మండపాలు ఏర్పాటుచేసుకునే ఉత్సవ కమిటీ నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి కోసం కమిషనర్‌ కార్యాలయంలోని యూపీఎస్‌సీ (యూనిపైడ్‌ పోలీస్‌ సర్వీస్‌ సెంటర్‌)లో  దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. యూపీఎస్‌సీ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేస్తుందని వివరించారు. దరఖాస్తు ఫారాలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా ఈ కింది నిబంధనలు విధించామని సీపీ పేర్కొన్నారు. 
 
నియమ నిబంధనలు – ముందస్తు జాగ్రత్తలు 
– పోలీస్‌ శాఖతో పాటు మున్సిపల్, అగ్నిమాపక, పంచాయతీ శాఖలు సమన్వయంతో చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతిస్తారు. 
– పోలీస్‌ వారికి దాఖలుచేసే అర్జీ పూర్తిచేయాలి. 
– ప్రతి పోలీస్‌ స్టేషన్‌ ఏరియాకు ఒక పోలీస్‌ అధికారిని, మిగతా శాఖలు, మండపాల ఆర్గనైజింగ్‌ కమిటీలు సమన్వయంతో పనిచేస్తాయి. ఆర్గనైజింగ్‌ కమిటీకి ఎలాంటి సమస్య, సందేహాలున్నా సమన్వయ అధికారిని గానీ, ఆ ఏరియా పోలీస్‌ స్టేషన్‌ను గానీ, 100 నంబరులో గానీ సంప్రదించాలి. 
– శబ్ద కాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నిబంధనలు–200 ప్రకారం రెసిడెన్షియల్‌ ఏరియాలో పగలు 55, రాత్రి 45 డెసిబుల్స్‌కు మించకుండా బాక్స్‌ టైపు స్పీకర్లను ఉపయోగించాలి. లౌడ్‌ స్పీకర్లు ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించరాదు.
– బాక్స్‌ స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే ఉపయోగించాలి. మైక్‌ను ధ్రువతరంగాలు–శబ్ద కాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నిబంధనలు–2000 ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. 
– విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను తెలియజేయాలి. బాక్స్‌ టైపు స్పీకర్లు వాడుతున్నదీ లేనిది వివరించాలి.
– భద్రత కోసం రాత్రి సమయాల్లో మండపాల వద్ద కాపలా ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నీరు, ఇసుక సిద్ధంచేయాలి.
– మండప పటిష్టతను దృష్టిలో పెట్టుకుని పూజ నిర్వహించే సమయంలో ఎక్కువ మంది జనం లేకుండా చూడాలి. పందిళ్ల చుట్టుపక్కల వాహనాలు పార్క్‌ చేయకూడదు. 
– పందిళ్లు రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు రోడ్లపై కట్టరాదు.
– ఊరేగింపు సమయంలో ఇతర కులాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు, బ్యాన ర్లు ప్రదర్శించడం చేయరాదు.  ఊరేగింపుతో పాటు వెళ్లే మత నాయకులు వేరే మతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా మత సామరస్యం పాటించాలి. 
– పందిళ్ల ఏర్పాటు, ఊరేగింపు సమయంలో వినియోగించే స్పీకర్ల యాంపిల్‌ వైర్‌ సిస్టమ్‌ను ముందుగా తనిఖీ చేసి వినియోగించాలి. 
– ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా వైరింగ్‌ జాగ్రత్తగా చేయించుకోవాలి. 
– నిమజ్జన ఊరేగింపులో రంగులు చల్లడం, బాణాసంచా పేల్చడం చేయరాదు. 
– ఊరేగింపు సమయంలో పోలీస్‌ అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్దం వచ్చే వాయిద్యాలు, తీన్‌మార్‌లు అనుమతించరాదు. 
– ఊరేగింపు సమయంలో భారీ వాహనాలు పెట్టరాదు. లారీలు, ట్రైలర్స్, ఆర్కెస్ట్రా వినియోగించరాదు. 
– ఊరేగింపులో కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి పాల్గొనరాదు. 
– రూట్‌ చ్చితంగా పాటించాలి. 
– ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. 
– ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్జీదారుడు, కార్యనిర్వాహకులు బాధ్యత వహించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement