పెట్రోలు, డీజిల్ పెంపుపై సీపీఐ వినూత్న నిరసన
తిరుపతి కల్చరల్: పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆటోను మోస్తూ వినూత్న ర్యాలీ చేపట్టారు. నగరంలోని గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పది సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. అవినీతి పేరుతో పెద్దనోట్లు రద్దు చేసి చిల్లర కష్టాలు తెచ్చిపెట్టారని ఆరోపించారు. దేశంలో క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గకపోవడం దారుణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటు న్న నిర్ణయాలతో కార్మిక వర్గం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతోందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మురళి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలతో వారిపై మరింత భారం పడిందని వాపోయారు. పెరిగిన ధరలను తగ్గించకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, రాధాక్రిష్ణ, ఎన్ డీ.రవి, కేవై.రాజా, శ్రీరాములు, ఇబ్రహీంబాషా, విజయలక్ష్మి, రత్నమ్మ, లక్షీ్మదేవి, చిన్నం కాళయ్య, జగన్నాథం, రామక్రిష్ణ, కవిత పాల్గొన్నారు.