సీబీఐ వలలో పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి
కడప అర్బన్ :
కడప పీఎఫ్ (భవిష్య నిధి) కార్యాలయం ఉద్యోగి దానంను సోమవారం లంచం తీసుకుంటుండగా గుంటూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పీఎఫ్‌కు సంబంధించి రుణాలను మంజూరు చేసేందుకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులను కడపలోని రీజనల్ పీఎఫ్ కార్యాలయంలో లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తున్న ఎస్. దానం కొంత మొత్తాన్ని లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు సోమవారం సాయంత్రం కార్యాలయం సమీపంలోని ఎల్‌ఐసీ క్వార్టర్స్ వెనుక వైపునకు దానంను రమ్మన్నారు. అక్కడకు వచ్చిన దానంకు రూ. 9 వేలు లంచంగా ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ డబ్బుతో పాటు మూడు క్వార్టర్‌ల
మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని పెద్దమనుషుల సమక్షంలో పంచనామా రాసుకుని మంగళవారం ఉదయం తమ వెంట గుంటూరుకు తీసుకుని వెళ్లారు. ఈ సంఘటన కడపలో మంగళవారం గుప్పుమంది. పీఎఫ్ కార్యాలయంలో కలకలం రేపింది. పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ బాలకృష్ణజీ తమ కార్యాలయం అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమీక్ష
నిర్వహించారు. అన్నివిభాగాల్లోని అధికారులను వ్యక్తిగతంగా పిలిచి విధుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించాలనీ, అవినీతికి పాల్పడితే వారే బాధ్యులవుతారనీ ఆయన హెచ్చరించారు. సంఘటనపై ఆర్‌సీ వివరణ కడపలోని పీఎఫ్ ప్రాంతీయ ఉప కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగి ఎస్.దానంను సీబీఐ అధికారులు పట్టుకున్న మాట వాస్తవమేనని, తమకు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని రీజనల్ కమిషనర్ బాలకృష్ణజీ మీడియాకు ఫోన్‌లో సమాచారం తెలిపారు.