వైకల్యాన్ని శాపంగా చూడొద్దు
సర్వశిక్ష అభియాన్ జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీనివాస్
నకిరేకల్ : ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని చూసి శాపంగా కాకుండా అదృష్టంగా భావించుకుని ప్రభుత్వం వారికి కల్పించే వివిధ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సర్వశిక్ష అభియాన్ అకాడమిక్ మానీటరింగ్ జిల్లా అధికారి అండెం శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నకిరేకల్‌లోని భవిత కేంద్రంలో గురువారం ప్రత్యేక అవసరాలు పిల్లల తల్లిదండ్రులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య పరంగా సామాన్య పిల్లలతో మాదిరిగా వీరు కూడా ఉన్నత స్థానాల్లో ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. అందరితో విద్య – అందరికి విద్య అనే సర్వశిక్ష అభియాన నినాదం ప్రకారం ప్రత్యేక అవసరాల గల పిల్లలను వేరు చేయకుండా సామాన్య పిల్లలతో కలిసి చదువుకునే అవకాశాలు కల్పిస్తుందన్నారు. స్థానిక ఐఈఆర్‌టీ సల్లోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రియో ఒలంపిక్‌లో జరిగిన పోటీల్లో సాధారణ క్రీడాకారులు వెండి, కంచు పతకాలు సాధిస్తే దివ్యాంగులైన క్రీడాకారులు రెండు స్వర్ణపతకాలు సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన శ్రీనివాస్, సబిత, రాపర్తి నర్సమ్మ, ఎల్మకంటి సైదమ్మ, మాదగోని సైదులు, మదార్ నాయక్, అబ్బగోని సైదులు, మారయ్య, రామేశ్వరి, అనూష, సైదమ్మ తదితరులు ఉన్నారు.