- జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి
యాలాల(రంగారెడ్డి జిల్లా)
తెలంగాణలో కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను సర్కారు చే పడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి విమర్శించారు. ఆదివారం కోకట్ మార్గంలో ఉన్న వెంకోబాగార్డెన్‌లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..11 కోట్ల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు.
కుటుంబ పాలన పాటించే కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే..సిద్దాంతాలు, కార్యకర్తల మనోభావాల మేరకు నడుచుకునే పార్టీ బీజేపీ అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను ఆకర్ష్ పేరిట విలీనం చేసుకున్నప్పటికి..బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం పార్టీ సిద్దాంతాలు, కార్యకర్తల కోసం పార్టీని వీడకుండా ఉన్నారన్నారు. దేశంలో మోడీ సర్కారు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికి క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడంతో వాటి విలువ జనాలకు తెలియడం లేదన్నారు. దేశానికి వెన్నుముకగా భావించే రైతన్నల కోసం మోడీ సర్కారు రూ.88లక్షల కోట్లు ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. వీటిలో ఫసల్ బీమా(పంట బీమా)తో పాటు సూక్ష్మరుణాలు ఇచ్చేందుకు ముద్ర, స్వచ్చభారత్, తదితర కార్యక్రమాలతో ముందుకెళుతుందన్నారు. పంట బీమాతో రైతన్నలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.
ముద్ర రుణాలతో చిన్నపాటి రుణాలు తీసుకుంటూ సామాన్య, మద్యతరగతి వారికి ఎంతో వెసలుబాటు కలుగుతుందన్నారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కారు మాటల ప్రభుత్వంగా తయారైందన్నారు. అధికారంలోకి రాకముందు దళితుడ్ని సీఎం చేస్తానన్నా కేసీఆర్, దళితులకు మూడెకరాలు పొలం విషయం మరిచిపోయాడన్నారు. వీటితో పాటు నేటికి అమలు కానీ డబుల్‌బెడ్ రూం, సమయానికి పంపిణీ కానీ ఆసరా పింఛన్లతో సామాన్యులు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు ముందుండి మోడీ సర్కారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
రానున్న సార్వాత్రిక ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ సర్కారు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడు బాలేశ్వర్‌గుప్తా, జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్యాట బాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామ్యనాయక్, బీజేపీ సర్పంచ్‌లు హన్మంతు(సంగెంకుర్దు)నర్సమ్మ(యాలాల), నాయకులు రవీందర్, గాజుల శాంత్‌కుమార్, వీరణ్ణ, నారాయణరెడ్డి, చికిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ