బీజేపీకి సవాల్ విసిరిన ఎంపీ కవిత
హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సాయంపై బీజేపీకి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. రెండేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆమె శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్దంగా అందాల్సిన నిధులు మాత్రమే రాష్ట్రానికి అందాయని కవిత తెలిపారు. అంతకన్నా తెలంగాణకు అదనంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వంటి ముఖ్య నేతలు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. హైకోర్టు విభజనపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కవిత సూటిగా ప్రశ్నించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 41 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరో వైపు కాంగ్రెస్ నాయకులపై ఆమె మండిపడ్డారు. ఆంధ్రా వాళ్లకి అమ్ముడుపోయిన వ్యక్తి కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్.. ముందుగా తన పార్టీని చక్కదిద్దుకోవాలని కవిత విమర్శించారు. నాయకత్వ లోపం ఉంది కాంగ్రెస్‌లోనేనని చెప్పారు. ఓర్వలేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో దొంగచాటు రాజకీయాలు లేవు.. ఇప్పుడు కాదు.. ఎప్పుడు, ఎవరు వచ్చినా కండువా కప్పి ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ నేతల నిజాయితీ ఏమిటో ప్రజలకు తెలుసునని, కమీషన్ల కోసం కక్కుర్తిపడే నాయకులు టీఆర్‌ఎస్‌లో లేరన్నారు. నీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ అని హడావుడి చేశారు.. ఆ సంగతి ఏమైంది? అని ప్రశ్నించారు.