మోదీ రాక నేడే
- నేడు, రేపు హైదరాబాద్‌లోనే ఉండనున్న ప్రధాని
- డీజీపీ/ఐజీపీల వార్షిక సదస్సుకు హాజరు
- రాజకీయ పార్టీలు, ప్రముఖులతో భేటీపై అస్పష్టత
- సాయంత్రం 4.10: వైమానిక దళ ప్రత్యేక విమానంలో చండీగఢ్ నుంచి బయలుదేరుతారు.
- 6.35: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 7.00: రోడ్డు మార్గంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు.
- 7 నుంచి 8 గంటల వరకు: విశ్రాంతి
- 8 నుంచి 9 గంటల వరకు: ఐపీఎస్‌లతో కలిసి విందు భోజనం చేస్తారు.
- అనంతరం విశ్రాంతి తీసుకుంటారు.
- ఉదయం 6 నుంచి 7 గంటల వరకు: అకాడమీ స్టేడియంలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
- 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు.
- 5.05: అకాడమీ నుంచి రోడ్డు మార్గాన శంషాబాద్‌కు బయలుదేరుతారు.
- 5.30: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
- 7.40: ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. చండీగఢ్ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి వస్తారు. గంటసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఐపీఎస్‌లతో విందు సమావేశంలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. ఢిల్లీకి బయలుదేరుతారు.
నోట్ల రద్దు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాని రాక ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పర్యటనలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులను, రాజకీయ పార్టీల నేతలను కలుస్తారా, లేదా? అనే దానిపై స్పష్టత లేదు. అలాంటి వివరాలేవీ ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో పొందుపర్చలేదు. అయితే తన దినచర్యలో భాగంగా ప్రధాని శనివారం తెల్లవారుజామున గంట సేపు యోగా కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం.
పోలీసు పతకాలు ప్రదానం చేయనున్న మోదీ
దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఏటా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్/ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీసు సంస్థల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 51వ వార్షిక సదస్సు జరుగుతోంది. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పాల్గొంటున్నారు. ఇంటెలిజెన్‌స బ్యూరో అధికారులకు రాష్ట్రపతి పోలీసు పథకాలను, పోలీసు పథకాలను ప్రదానం చేయనున్నారు. సాధారణంగా ఈ వార్షిక సదస్సులను 2013 వరకు ఏటా ఢిల్లీలోనే నిర్వహించేవారు. 2014లో తొలిసారిగా ఢిల్లీకి వెలుపల అస్సాంలోని గువాహటిలో నిర్వహించారు. గతేడాది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో జరగగా.. ఈ ఏడాది హైదరాబాద్ ఇందుకు వేదిక అయింది.
ప్రధాని షెడ్యూల్ ఇదే..
నవంబర్ 25 (శుక్రవారం)
నవంబర్ 26 (శనివారం)