అనంత స్వేచ్ఛ ఆటా.. పాట! | Poker, Cricket betting, Adultery in ananthapuram | Sakshi
Sakshi News home page

అనంత స్వేచ్ఛ ఆటా.. పాట!

Published Tue, Sep 5 2017 2:38 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

అనంత స్వేచ్ఛ  ఆటా.. పాట!

అనంత స్వేచ్ఛ ఆటా.. పాట!

జోరుగా పేకాట, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్, వ్యభిచారం
బళ్లారి, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల నుంచి రాకపోకలు
స్టార్‌ హోటళ్లు, లాడ్జీలు, క్లబ్‌లు, పర్యాటక, అటవీ ప్రాంతాలే అడ్డాలు
బంకినీకో అడ్డాతో నిర్వహణ
వాట్సాప్‌లో అడ్రస్‌లు.. ఫొటోలు, పేకాటరాయుళ్ల వివరాలు

పీఏబీఆర్‌ డ్యాం.. తాడిపత్రి.. పెన్నహోబిళం.. మాసినేని గ్రాండ్‌! ప్లేస్‌ ఏదైనా ఆడే ఆట మాత్రం ఒక్కటే! కర్నూలు, వైఎస్సార్‌ కడప, బళ్లారి జిల్లాల నుంచి అనంతపురానికి పేకాట ఆడేందుకు రోజూ వందల సంఖ్యలో వస్తున్నారంటే ‘అనంత’ స్వేచ్ఛ ఇట్టే అర్థమవుతోంది. పేకాట, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్, వ్యభిచారం దెబ్బకు వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. కొన్నేళ్లుగా వేళ్లూనుకున్న ఈ అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసు బాస్‌ నిఘా సారించినా.. కళ్లుగప్పి సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాసినేనిగ్రాండ్‌ ఓ త్రీస్టార్‌ హోటల్‌. ఇక్కడ ఒకే రోజు ఏకంగా ఆరు గదుల్లో 48 మంది పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. అంతమంది ఆరు గదుల్లో ఉంటే ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని యాజమాన్యం కూడా గాలికొదిలేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పేకాట దెబ్బకు రెండు నెలల క్రితం తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఛిద్రమైంది. ఆ ఉదంతం తర్వాత పేకాటపై ఎస్పీ అశోక్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. తాడిపత్రితో పాటు  పేకాట అడ్డాలపై ప్రత్యేక బృందంతో తనిఖీలు చేయించారు. ఈ క్రమంలో వీరంతా స్టార్‌హోటళ్లు, లాడ్జీలకు మకాం మార్చారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఉండవనే భావనతో వీటిని ఎంచుకున్నారు. తాడిపత్రి, పీఏబీఆర్, వై.రాంపురం ప్రాంతాల్లో సాగుతున్న పేకాటకు ఇతర జిల్లాలు, కర్ణాటక వాసులు కూడా వచ్చి వెళ్తున్నారు. ఒక్కో బంకినీ వద్ద రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఆట జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఏబీఆర్‌ ప్రాంతంలోనే రోజూ 5–10 బంకినీలు ఉంటాయి. తాడిపత్రి, రాంపురంలో కలిపి మరో 10 వరకూ ఉంటున్నాయి. ఇక్కడ ఒక్కోచోట రూ.10లక్షల వరకు.. హోటళ్లలో రూ. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల ఆట జరుగుతోంది. రాయదుర్గంలోని క్లబ్‌లో పేకాట ఆడి ఓ రాజకీయ నాయకుడి బంధువు రూ.70లక్షలు, మరొకరు రూ.30లక్షలు పొగొట్టుకోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసులకు తెలిసిన తంతే..
పేకాట, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ చిట్టా స్థానిక పోలీసులకు తెలియనిది కాదు. అయితే వారితో ఉన్న సత్ససంబంధాల నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో సుదీర్ఘకాలం ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు తిష్టవేసి ఉండటంతో వీటి నియంత్రణను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. వన్‌టౌన్‌ ఏరియాలో ఇప్పటికీ మట్కా విచ్చలవిడిగా సాగుతోంది. గతంలో మట్కాకింగ్‌ అరెస్టు తర్వాత కొద్దికాలం నిలిపేశారనిపించినా.. ఆ తర్వాత ‘మూడు బ్రాకెట్లు.. ఆరు క్లోజ్‌’లుగా వర్ధిల్లుతోంది. ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా నడుస్తోంది. గతంలో రతన్‌ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు నిర్వహిస్తున్నారు. ఈ మాట్కా నెంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఇది ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5గంటల వరకూ డబ్బు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్‌(బ్రాకెట్‌) నెంబర్‌ ప్రకటిస్తారు. మట్కా రాసే జాబితాలో కాలేజీ విద్యార్థులు కూడా చేరుతున్నారు. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

‘క్రికెట్‌ బెట్టింగ్‌’కు అడ్డాగా ‘అనంత’
ప్రొద్దుటూరులో బెట్టింగ్‌ ఏ స్థాయిలో నడుస్తోందో, ఇప్పుడు ‘అనంత’లోనూ అదేస్థాయిలో సాగుతోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్‌ షాపు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్‌ ఊబిలో చిక్కుకున్నారు. క్రికెట్‌ ఆడే దేశం ఏదైనా టీవీలో ‘లైవ్‌’ కన్పిస్తే చాలు బెట్టింగ్‌ తెరపైకి వస్తోంది. వీరిలో అధికశాతం మంది కేఫ్‌లలో కూర్చుని లెక్కలేసుకుంటున్నారు. బెట్టింగ్‌ ఆడేవారిలో వ్యాపారులతో పాటు ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ అధికంగా ఉంటున్నారు. మ్యాచ్‌ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్‌లతో పాటు ‘లైవ్‌’ ఉన్న సమయంలో లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని గ్రూపులుగా వెళ్లి బాల్‌ టు బాల్‌ బెట్టింగ్‌ ఆడుతున్నారు.

యథేచ్ఛగా వ్యభిచారం
‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లులోనూ వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. అనంతపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో 8 నెలల కిందట ఇద్దరు ఆర్డీఓ స్థాయి అధికారులు, ఓ కమిషనర్‌ స్థాయి అధికారి ఒకే రోజు వేర్వేరు గదుల్లో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అరెస్టు చూపిస్తే ఉద్యోగాలు, పరువు పోతాయని భారీగా ముట్టజెప్పి తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్‌లో వీటికి అడ్డాగా ఉన్న లాడ్జీలను మూయించారు. ప్రస్తుతం బస్టాండ్‌ సమీపంలోని లాడ్జీలకు మకాం మారింది. దీంతో పాటు ప్రముఖ హోటళ్లలో హైటెక్‌ వ్యభిచారం నడుస్తోంది. ఆన్‌లైన్‌ డేటింగ్‌సైట్‌లో బుక్‌చేసుకున్న యువతలు ఇలాంటి హోటళ్లలో దిగుతున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు, శారదానగర్, కళ్యాణదుర్గం రోడ్డులో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. తాడిపత్రిలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో ఎక్కువగా వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం.

ఎస్పీకి తప్పుడు నివేదికలు
ఎస్పీగా అశోక్‌కుమార్‌ బాధ్యతలు తీసుకునే సమయంలో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో చితికిపోయిన ఈ జిల్లాలో ఇప్పుడు పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయి. వీటిని నివారిస్తే చాలా కుటుంబాల్లో ప్రశాంతత నింపినట్లే! తద్వారా క్రైం రేటును పరోక్షంగా తగ్గించినట్లు అవుతుంది. ఇది గ్రహించిన ఎస్పీ బాధ్యతలు తీసుకోగానే వీటిపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ తర్వాత మట్కారాయుళ్ల ఊరొదిలి వెళ్లారు. పేకాట నిలిచిపోయింది, బెట్టింగ్‌ జరగడం లేదని కొంతమంది మిడిల్‌ బాస్‌లు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తాజా పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement