ఖాకీ చెక్కిన రాకాసి | police, politicians helped to nayeem | Sakshi
Sakshi News home page

ఖాకీ చెక్కిన రాకాసి

Published Thu, Aug 11 2016 1:14 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

ఖాకీ చెక్కిన రాకాసి - Sakshi

ఖాకీ చెక్కిన రాకాసి

నయీమ్ వెనుక పోలీస్ పవర్  
దానికి తోడైన రాజకీయ అండ

అతడో ‘పోలీస్ ఆయుధం’..
చట్టం పరిధిలో లేని అనేక పనులకు ఖాకీలు ఆ ఆయుధాన్ని వాడారు..
కొందరు ఐపీఎస్‌లు ఓ అడుగు ముందుకేసి సొంత పనులకు వాడుకున్నారు..
అలా ఒక్కరిద్దరు కాదు.. 14 మంది ఐపీఎస్‌లు!
అతడో రాజకీయ అస్త్రం..
నేతల వ్యవహారాలు ‘చక్కబెట్టే’ పనిముట్టు..
అతడితో సాన్నిహిత్యమున్న నేతలు లెక్కకు మిక్కిలి!

‘నీకో కొడుకున్నడు.. 2 కోట్లిస్తవా..
కొడుకు చావు కళ్లజూస్తవా..’

ఖాకీ, ఖద్దరు కలసి చెక్కిన ఆ రాకాసి.. ఓ కాంట్రాక్టర్‌కు చేసిన బెదిరింపులు!!!
 
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలపాటు గ్యాంగ్‌స్టర్ నయీమ్ సాగించిన వికృత క్రీడను చూసీచూడనట్టు వదిలేసిన ఖాకీ టోపీలు కొన్నయితే.. అన్నీ తెలిసినా నోరుమెదపని ఖద్దరు టోపీలు మరికొన్ని..! విద్యార్థి దశలో ఉన్నప్పుడే రౌడీగా చలామణి కావాలన్న నయీమ్ ఆరాటానికి అటు పోలీసు పవర్.. ఇటు రాజకీయ అండ తోడవడంతో మరింత రెచ్చిపోయాడు. రెండు వర్గాలకు అతి సన్నిహితంగా మెలుగుతూ బెదిరింపులు, కబ్జాలు, సెటిల్‌మెంట్లు, హత్యలతో వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. చివరికి ప్రభుత్వానికే సవాల్‌గా మారాడు. ఆ నేర సామ్రాజ్యం, అతి దారుణంగా సాగించిన వికృత క్రీడలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మరి ఇన్నాళ్లూ అతడికి అండదండలు అందించిన ‘అదృశ్య శక్తులు’ ఏ సమయంలో ఎలా వ్యవహరించాయి? తమ ఆయుధాన్ని అవసరానికి ఎలా వాడుకున్నాయి? ఆ గ్యాంగ్‌స్టర్ రక్త చరిత్రలో కీలక మలుపులేంటి..?
 
అతడి లక్ష్యం... రౌడీ!: చదువుకునే వయసులో విద్యార్థులు సాధా రణంగా ఇంజనీరో.. డాక్టరో.. లేదా పెద్ద వ్యాపారవేత్తో కావాలని కలలు కంటారు. కానీ నయీమ్ అందుకు భిన్నం. రౌడీ కావాలనుకున్నాడు. అందుకు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొనేవాడు. డిగ్రీలో చేరిన తర్వాత అప్పుడే ప్రారంభమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాగానే పీపుల్స్‌వార్‌పై నిషేధాన్ని తొలగించడంతో ఆర్‌ఎస్‌యూ తన కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. 1990 ప్రారంభ దశకంలో నయీమ్ ఈ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఆలేరు దళంలో బాలన్న పేరుతో పీపుల్స్‌వార్‌లో చేరాడు.

కోవర్టు అవతారం..
పీపుల్స్‌వార్‌లో ఉన్నప్పుడే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసులపై నయీమ్ బాంబు విసిరాడు. పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో ఉన్న కొద్ది కాలంలో.. అదే జైలులో ఉంటున్న పీపుల్స్‌వార్‌లోని పెద్ద నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. బయటకు రాగానే పీపుల్స్‌వార్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను కాల్చిచంపిన ఘటనలో మరోసారి పోలీసులకు లొంగిపోయాడు. ఇక్కడే అతడు ‘కోవర్టు’గా మారేందుకు బీజాలు పడ్డాయి. నయీమ్‌ను కోవర్ట్‌గా మార్చుకునేందుకు అప్పటి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఎస్పీ స్థాయి అధికారిని జైలుకు పంపారు. అదే అధికారి తర్వాతి కాలంలో సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు వివాదంలో చిక్కుకున్నారు. 1996-1999 మధ్య జైల్లో ఉన్న నయీమ్ ద్వారా అప్పటి పీపుల్స్‌వార్ నక్సలైట్ల ఆచూకీ తెలుసుకున్న పోలీసులు.. జనజీవన స్రవంతిలో ఉంటూ పరోక్షంగా నక్సలైట్లకు సహాయపడుతున్న దాదాపు 50 మందిని ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారన్న ఆరోపణలు ఉన్నాయి.

జైలు నుంచే మర్డర్లకు ప్లాన్..
నక్సల్స్ ఏరివేతకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి నియోజకవర్గమైన భువనగిరినే పోలీసులు టార్గెట్‌గా చేసుకున్నారు. ఆలేరు దళం కార్యకలాపాలు అధికంగా ఉండటంతో పోలీసులు ఈ ప్రాంతంలో నక్సల్స్ సానుభూతిపరులెందరినో అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో ఉంటూనే నయీమ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లు నడుచుకునేవాడు. హత్యలకు కూడా ఇక్కడ్నుంచే వ్యూహం పన్నేవాడు. నయీమ్ సోదరుడు అలీముద్దీన్ ద్వారా వ్యూహాన్ని అమలు చేసేవాడు. అలీముద్దీన్ కూడా ఓ గ్యాంగ్ తయారు చేశాడు. తెలంగాణ కళా సమితి పేరుతో జనశక్తి సానుభూతిపరురాలు బెల్లి లలిత ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న దశలో నయీమ్ ఆమెను హతమార్చేందుకు కుట్ర పన్నాడు. అందుకు ‘ప్రేమ’ సెంటిమెంట్‌ను ప్రయోగించాడు.

విద్యార్థి దశ నుంచి పరిచయం ఉన్న లలితను పెళ్లి చేసుకుంటానని నయీమ్ అతని సోదరుడి ద్వారా వర్తమానం పంపాడు. ఆమెను జైలుకు రప్పించుకొని మాట్లాడి నమ్మకం కల్పించాడు. నిజంగానే తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మిన బెల్లి లలిత కొద్దికాలం తర్వాత నయీమ్ సోదరుడు అలీముద్దీన్ తన గ్యాంగ్‌తో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆమెను 18 ముక్కలుగా చేసి శరీర భాగాలను పలుచోట్ల పడేయడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆలేరు దళంలో ఉండగా తోటి నక్సలైట్ ఈదన్నతో నయీమ్ పరిచయం పెంచుకున్నాడు, ఈదన్న ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రిలో చేరినప్పుడు నయీమ్ తన సోదరిని సహాయకురాలిగా ఉంచాడు. అయితే ఈదన్న తనను వేధిస్తున్నాడని సోదరి ఫిర్యాదు చేయడంతో నయీమ్ అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఇదే కారణంతో అలీముద్దీన్ ద్వారా ఈదన్నను దారుణంగా హత్య చేయించాడు.
 
ఖాకీలతో చెలిమికి బీజం ఇలా..
నక్సలైట్ ఈదన్నను చంపేయడంతో నయీమ్-పోలీసుల మధ్య అనుబంధం పెరిగిపోయింది. నక్సలైట్లను హతమారుస్తున్న నయీమ్‌పై పోలీసులు బాగా నమ్మకం పెంచుకున్నారు. జైల్లో ఉంచడం కంటే బయట ఉంచడమే మంచిదని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు 1999లో అతడిని విడుదల చేశారు. ఇక పోలీసులతో అతని బంధం పెనవేసుకుపోయింది. పనిలో పనిగా రాజకీయ ప్రముఖులు కూడా అతని ద్వారా ఎన్నో పనులు చేసుకున్నారు.
 
వాడుకున్న ఐపీఎస్‌లు ఎందరో..
 నక్సలైట్లను నిర్మూలించడానికి నయీమ్‌ను వాడుకుంటామన్న పోలీసు అధికారులు చివరకు వారి సొంత పనులకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. జైల్లో ఉండగా నయీమ్‌ను కోవర్ట్‌గా మలుచుకున్న ఓ ఐపీఎస్ అధికారి తన సమీప బంధువుల అమ్మాయి ప్రేమించిన వ్యక్తి(బిహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్)ని బెదిరించేందుకు అతడిని వాడుకున్నారు. అత్యుత్సాహానికి పోయిన నయీమ్ 28 ఏళ్ల ఆ సాఫ్‌్రవేర్ ఇంజనీర్‌ను బిహార్‌లోనే హత్య చేశాడు. 1999-2003 మధ్య కాలంలో పోలీసుల అండతో నయీమ్ చెలరేగిపోయాడు. కాంట్రాక్టర్లను బెదిరించాడు. అడ్డొచ్చినవారిని హతమార్చాడు. ఈ మధ్య కాలంలో అతనితో 14 మంది ఐపీఎస్ అధికారులు సాన్నిహిత్యం పెంచుకున్నారు. వీరిలో కొందరు నయీమ్‌ను ఇన్‌ఫార్మర్‌గా వినియోగించుకుంటే.. ఎక్కువ మంది సొంత పనులకు వాడుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 70 ఎకరాలు కొనుగోలు చేయడానికి ఓ ఐపీఎస్ అధికారి నయీమ్‌ను ప్రయోగించాడు. పరిశ్రమ స్థాపన కోసం మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ రోడ్డు కాంట్రాక్టర్‌ను నయీమ్ హత్య చేస్తానని బెదిరించాడు. చివరికి భూమిని తక్కువ ధరకు అమ్మాలని డిమాండ్ చేశాడు. కాలక్రమంలో ఆ భూమి సదరు ఐపీఎస్ అధికారి సమీప బంధువులకు దక్కింది, నల్లగొండ జిల్లాలో పని చేసిన డీఎస్పీ, సబ్ ఇన్‌స్పెక్టర్ ఇద్దరూ నయీమ్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నో భూ దందాలు చేశారు. పేద రైతులను బెదిరించి వందలాది ఎకరాలను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ డీఎస్పీ ఇప్పుడు పదవీ విరమణ చేయగా, అప్పటి ఎస్సై ఇప్పుడు ఏసీపీ హోదాలో పని చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారిగా ఇటీవల పదవీ విరమణ చేసిన మరో ఐపీఎస్ అధికారి జూబ్లీహిల్స్‌లో 1200 చదరపు గజాల స్థలాన్ని సొంతం చేసుకోడానికి నయీమ్‌ను వాడుకున్నాడు.
 
రాజకీయ అను‘బంధం’ ఇదీ..
 నయీమ్, అతడి ముఠా వ్యక్తులు ఎక్కడ ఎవరిని హత్య చేసినా విచారణ వద్దంటూ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందేవి. దీంతో పోలీసు అధికారులు వెనుకడుగు వేసేవారు. నల్లగొండ జిల్లాలో ఒకేసారి ముగ్గురిని హతమార్చిన కేసులో నయీమ్ అంతు చూడాలని ఓ ఐఎఎస్ అధికారి పట్టుదల ప్రదర్శించారు. అయితే నయీమ్‌ను ఏం చేయొద్దంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి స్వయంగా ఫోన్ చేసి ఆ అధికారిని ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఓ మంత్రితోపాటు అధికార పార్టీకి చెందిన ఇద్దరు శాసనమండలి సభ్యులు నయీమ్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపినట్లు ఆరోపణలున్నాయి. వారికి కావాల్సిన పనులను నయీమ్ ద్వారా చక్కబెట్టుకున్నారు. రాజధానికి చెందిన ఓ మాజీ మంత్రి (కాంగ్రెస్), నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి (కాంగ్రెస్) కూడా నయీమ్‌తో సన్నిహితంగా ఉండి అతడి ద్వారా పనులు చేసుకున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ఎందరో నేతలు నయీమ్‌తో పనులు చేయించుకున్నారు. వారిలో కొందరు ఇటీవల కాలం దాకా నయీమ్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి పోటీ చేయాలని ఉత్సాహం చూపిన మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య వెనుక కూడా కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉంది. సాంబశివుడు అక్కడ్నుంచి గెలిస్తే ఇక తమకు పుట్టగతులు ఉండవని భావించిన వారు.. నయీమ్ ద్వారా అతడి హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాంబశివుడి సోదరుడు కోనాపురి రాములును కూడా నయీమ్ గ్యాంగ్ చంపడం వెనుక కూడా రాజకీయ శక్తుల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి.

సర్కారుకే సవాల్‌గా..
నేతలు, పోలీసుల అండదండలతో ఎదిగిన నయీమ్ చివరికి ప్రభుత్వానికే పెద్ద సవాల్‌గా మారాడు. నల్లగొండ అయితే ఇతడి అరాచకాలు తారస్థాయికి చేరాయి. ఆఖరికి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగాలన్నా.. ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా నయీమ్ అనుమతి తీసుకునే స్థాయికి చేరింది. భువనగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలా శేఖర్‌రెడ్డికి గతేడాది నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ కారణంగానే ఎమ్మెల్యేకు బుల్లెట్‌ఫ్రూప్ వాహనంతో పాటు ఐదుగురు గన్‌మన్లను ప్రభుత్వం సమకూర్చింది. అధికార పార్టీకే చెందిన డజను మంది ఎమ్మెల్యేలు నయీమ్ బాధితులుగా మారారు. చివరికి రాష్ట్రంలో అత్యున్నత స్థాయి రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని కూడా బెదిరించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement