
సెక్స్ రాకెట్ నిందితుడి ఫామ్‌హౌస్‌పై దాడి
* 45 కోడి పుంజులు స్వాధీనం
* ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయవాడ సిటీ: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ఆరో నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ ఫామ్‌హౌస్‌పై టాస్క్‌ఫోర్స్, నున్న రూరల్ పోలీసులు సంయుక్త దాడులు చేశారు. అక్కడ కోడి పందేల నిర్వహణ కోసం పెంచుతున్న 45 కోడి పుంజులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌ను సీజ్ చేయడంతోపాటు కోడి పుంజులకు రక్షణగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పటమట పంటకాల్వ రోడ్డులో కాల్‌మనీ దందా నిర్వహిస్తున్న యలమంచిలి రాము ముఠా ఆగడాలపై వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాచవరం పోలీసులు నమోదు చేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు రాముతోపాటు రెండో నిందితుడు భవానీ శంకర్, ఏడో నిందితుడు దూడల రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో విద్యుత్‌శాఖ డీఈ సత్యానందం, చెన్నుపాటి శ్రీనివాసరావు, వెనిగళ్ల శ్రీకాంత్‌తోపాటు ఆరో నిందితుడైన పెండ్యాల శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి వద్ద ఆశ్రయం పొందిన శ్రీకాంత్.. రెండ్రోజులుగా విజయవాడ రూరల్ మండలం అప్పారావుపేటలోని 25 ఎకరాల మామిడి తోటలో ఉన్నట్టు తెలిసింది. తోటలో ప్రత్యేకంగా నిర్మించిన తన ఫామ్‌హౌస్‌లోనే ఉన్నట్టు పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకు దాడి చేయాలని కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. బుధవారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్, నున్న రూరల్ సీఐ సహేరా ఆధ్వర్యంలో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఆ సమయంలో శ్రీకాంత్ అక్కడ లేడు. అయితే కోడి పందేల నిర్వహణ కోసం పెంచుతున్న 45 పందెంకోళ్లు, వాటికి కాపలాగా ఉన్న ఇద్దరు మనుషులను అదుపులోకి తీసుకొని కాపలాగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.