పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబసభ్యులు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజయ్య తదితరులను తరలించే సమయంలో పలువురు మహిళలు పోలీసు వాహనాలకు అడ్డు రాగా, వారిని తోసేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారని సీపీ చెప్పారు. అగ్నిప్రమాదం వల్లే సారిక, పిల్లలు మరణించారని, అయితే అది ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా అన్న విషయం విచారణలో మాత్రమే తేలుతుందని చెప్పారు. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.