నోట్ల రద్దుతో పేదలకు ఇబ్బందులు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు క్షమించరు
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య
కర్నూలు(ఓల్డ్‌సిటీ): నలధనాన్ని అడ్డుకట్ట వేస్తామంటూ ప్రధాని మోదీ రూ. 500, 1000 నోట్లను రద్దు చేసి పేదలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య అన్నారు. మంగళవారం స్థానిక రాయల్ ఫంక‌్షన్ హాల్‌లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మొదట్నుంచీ కార్పొరేట్ వ్యక్తులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, నోట్ల రద్దు నిర్ణయం కూడా వారికి మేలు చేసేలా ఉందన్నారు. ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండ నోట్ల రద్దు చేయడంతో 11 మంది బ్యాంకు ఉద్యోగులు, 50 నుంచి 60 మంది సామాన్యుల ప్రాణాలు పోయాయన్నారు. దీనికి కారకులు ఎవరని ప్రశ్నించారు. నల్లకుబేరులపై సర్జికల్ దాడులంటే పేద, మధ్యతరగతి ప్రజలపై చేశారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు మంచి నిర్ణయమంటూ, తన వల్లే ఇది జరిగిందని మొదట్లో గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నాడని మండిపడ్డారు. ప్రధాని, ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు క్షేమించరని చెప్పారు. సమావేశంలో కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.