ప్రజా ఉద్యమంలా మొక్కలు నాటాలి
కడప అర్బన్ :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృతృంలో ‘వనం–మనం’ కార్యక్రమం చేపడుతున్నామనీ, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను ప్రజా ఉద్యమంలా నాటాలని సంకల్పించామని రాష్ట్ర మానవ వనరుల, విద్యాశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కడప నగర శివార్లలోని రిమ్స్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కడప నగర వనం ప్రాంగణంలో ‘వనం– మనం’ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 11.48 లక్షల మొక్కలను నాటుతామని జిల్లా కలెక్టర్
కేవీ సత్యనారాయణ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ మొక్కలను నాటడంతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరూ పది మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్‌వి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎర్రచందనం చెట్లను అవగాహన లేని సమయంలో వంటచెరకుగా వాడిన సందర్భాలున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కెవి సత్య నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి కరుణించి 30 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందన్నారు. చిన్నారుల చేతుల మీదుగా మొక్కలు నాటే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎఫ్ ఉదయ భాస్కర్, జిల్లాజాయింట్ కలెక్టర్ శ్వేత తేవతీయ, డీఎఫ్‌ఓ బి.ఎం.దివాన్ మైదీన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, సురేష్ నాయుడు, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రీష్మ అనే చిన్నారి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది.కార్యక్రమం ముగింపులో మొక్కల పెంపకంపై అందరూ ప్రతిజ్ఞ చేశారు.