పల్స్ సర్వేకు అన్నీ అడ్డంకులే..
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన ప్రజాసాధికార సర్వే ప్రహసనంగా సాగుతోంది. వివరాల నమోదుకు ప్రభుత్వం రూపొందించిన యాప్ గందరగోళంగా ఉండటం, ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించకపోవడం, పదేపదే కార్యక్రమాన్ని వాయిదా వేయడం వెరసి అనేక సమస్యలతో స్మార్ట్ పల్స్ సర్వే నగరంలో ప్రహసనంగా సాగుతోంది. వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్యూమరేటర్లుగా అవతారమెత్తి ఇంటింటికి తిరిగి వివరాలు నమోదు చేస్తున్నా కొలిక్కి రాకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. వరుస సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నెల 25 నాటికి పూర్తిచేయాలని గడువు విధించటంతో సిబ్బంది హడావుడి పడుతున్నారు.
రాష్ట్రంలోని నివాస గృహాల్లో ఉండే ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేకు శ్రీకారం చుట్టింది. తద్వారా సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకంగా, అర్హులకు మాత్రమే అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూలై 8న సీఎం చంద్రబాబు చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రక్రియ అనేక సమస్యలతో కొనసాగుతోంది. సర్వే ప్రారంభించిన వెంటనే జిల్లాలో పుష్కరాల హడావుడి మొదలవడంతో ప్రక్రియ పూర్తిగా నెమ్మదించింది. ఆ తర్వాత ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో జూలై 8 నుంచి ఆగస్టు 24 వరకు వివరాలను నమోదు చేసుకునే యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆరుసార్లు మార్పులు చేర్పులు చేశారు. దీంతో కొన్ని వివరాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో సర్వే మొదటినుంచి నిర్వహించాల్సిన పరిస్థితి గుంటూరులో ఏర్పడింది. నగరంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు కలిపి 1,89,733 నివాస గృహాలు ఉండగా, వాటిలో 7,31,501 మంది నివసిస్తున్నారు. వీటిలో ఇప్పటికీ 2,76,436 మంది వివరాలు నమోదు కావాల్సి ఉంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి సూపర్‌వైజర్లతో పాటు 360 మంది ఎన్యూమరేటర్లు విధుల్లో ఉన్నారు.
రంగంలోకి ఏఎన్‌యూ విద్యార్థులు..
సర్వేకు గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు ఏఎన్‌యూ విద్యార్థులను రంగంలోకి దింపారు. మొత్తం 150 మందిని ఈ సర్వేకు వినియోగించుకోవాలని భావించినా 50 మందికి మించి సర్వేలో పాల్గొనలేదు. సోమవారం కొంతమంది విద్యార్థులకు సర్వేపై అవగాహన కల్పించారు. అయినా వారికి స్పష్టత రాలేదు. దీంతో విద్యార్థులు ఎంతమంది సర్వేలో పాల్గొంటారో అధికారులే చెప్పలేకపోతున్నారు.
స్పష్టత లేని ప్రభుత్వ ఆదేశాలు..
రాష్ట్ర ప్రభుత్వం సాధికార సర్వేకు సంబంధించి పూటకో నిబంధన మారుస్తుండటం మరింత సమస్యాత్మకంగా మారింది. తొలుత సర్వేలో భాగంగా కుటుంబ పెద్ద వేలిముద్రలు తీసుకుని మిగిలిన కుటుంబసభ్యుల పేరు, వివరాలు, వారి ఆధార్, రేషన్ కార్డు, ఇతర వివరాలు సేకరించారు. దాదాపు 20 రోజుల పాటు ఈ పద్ధతుల్లో సర్వే సాగింది. మళ్లీ ప్రభుత్వం దీనిలో మార్పులు చేసింది. కుటుంబంలో ప్రతి సభ్యుడి వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డు, ఇతర వివరాలు మొత్తం సేకరించాలని ఆదేశించడంతో మళ్లీ రెండోసారి ఇంటిబాట పడుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో వివరాలు నమోదు చేసుకునే మిషన్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం, ఇంటర్‌నెట్‌లు పనిచేయక యాప్ పనిచేయకపోవడంతో కొన్ని రోజులపాటు సర్వే నిలిచింది. సోమవారం 360 మంది ఎన్యూమరేటర్లు.. ఇంటర్‌నెట్ పనిచేయకపోవడంతో సర్వే నిర్వహించకుండానే వెనుదిరిగారు.