‘పుష్కర’ కేసులో ఛార్జిషీట్ వేసేదెన్నడు?
తొక్కిసలాటపై కేసు నమోదు చేసిన పోలీసులు
రెండేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తికాని విచారణ
కొనసాగుతోందంటూ కమిషన్‌కు వివరణ
ఛార్జిషీట్ వేస్తే కారణాలు, బాధ్యులు
ఎవరో తెలిసే అవకాశం
సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోంది. 2015 జూన్ 14న పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అదే రోజు ఉదయం సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరఘాట్‌లో పూజలు, పుణ్యస్నానాలు ఆచరించారు. అ సమయంలో గంటన్నరపాటు లోపలికి వచ్చే భక్తులు బయటకు వెళ్లకుండా ఉన్న ఒక్కగేటు మూసివేశారు. గేటు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసటాల చోటుచేసుకుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 28 మంది మరణించగా 51 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో స్థానిక పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 174 ప్రకారం 2015లో కేసు నంబర్ 268/2015 నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా విచారణ ఓ కొలిక్కి రాలేదు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు ఏక సభ్యకమిషన్ కు చెబుతున్నారు. మొదట దర్యాప్తునకు ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్‌ను నియమించారు. కొన్ని రోజులు తర్వాత బదిలీపై అబింకా ప్రసాద్ వెళ్లిపోయారు. ఆయన తర్వాత కేసును ప్రస్తుతం అమలాపురం డీఎస్పీగా పనిచేస్తున్న అంకయ్యకు అప్పగించారు. అయితే నేటికీ కేసు విచారణ దశలోనే ఉండడం గమనార్హం. పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ పూర్తి చేసి చార్జిషీటు వేస్తే కమిషన్ విచారణకు ఉపయోగకరంగా ఉండేది. అయితే ముందు నుంచి కమిషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్న అన్ని ప్రభుత్వ విభాగాలులాగే పోలీసు శాఖ కూడా ఈ కేసుపై నాన్చివేత ధోరణి అవలబింస్తోంది. సీసీటీవీల ఫుటేజీలు లేవని చెప్పడం, రికార్డు కాలేదని, లైవ్ కోసమే వాటిని ఏర్పాటు చేశామని చెప్పడంతో యంత్రాంగం నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించిందో స్పష్టమవుతోంది. చనిపోయిన 28 మందికి పంచనామాలు, పోస్టుమార్టం నివేదికలు కమిషన్‌కు ఇస్తే కమిషన్ విచారణకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా చనిపోయిన, గాయపడ్డవారిని అక్కడ నుంచి ఎంత సమయానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు? ఆలస్యమైతే దానికి బాధ్యులు ఎవరు? అన్న విషయాలు దర్యాప్తులో తేలే అవకాశం ఉండేది. కానీ విచారణ పూర్తి చేయడానికి పోలీసుశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విషయం మంగళవారం జరిగిన కమిషన్ విచారణలో తేటత్లెమవుతోంది. కనీసం ఫలానా సమయానికి విచారణ పూర్తవుతుందని కూడా పోలీసు అధికారులు చెప్పకపోవడం గమనార్హం.
కేసుపై పోలీసుల నిర్లక్ష్యం..
తొక్కిసలాటపై పోలీసులు పెట్టిన కేసు ఇప్పటికీ పూర్తికాకపోవడం విడ్డూరం. గాయపడిన వారి ధ్రువపత్రాలు వచ్చిన తర్వాత చార్జిషీటు వేస్తామని గత విచారణ సందర్భంగా పోలీసులు చెప్పారు. ఆ పత్రాలను కమిషన్‌కు కూడా సమర్పించారు. కానీ వారి విచారణ పూర్తి చేసి చార్జిషీటు మాత్రం వేయకపోవడం కేసుపై వారి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.
– ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది,
బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుడు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు