ఆర్టీసీకి పండొగచ్చింది!
నిజామాబాద్ నాగారం: ఆర్టీసీకి పది రోజుల ముందే పండుగొచ్చింది! విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో గురువారం బస్టాండ్‌లన్నీ కిటకిటలాడాయి. సొంతూళ్లకు వెళ్లే విద్యార్థులతో బస్సులన్నీ నిండిపోయాయి. వరుసగా బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలు రావడంతో శుక్రవారం నుంచి అక్టోబర్ 12 వరకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులంతా హాస్టళ్లను వీడి సొంతూళ్లకు బయల్దేరారు. గురువారం మధ్యాహ్నం నుంచి బస్సులన్నీ కిటకిటలాడుతూ బయల్దేరాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ కిక్కిరిసి పోయింది.
ప్రత్యేక బస్సులు..
వరుస సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిజామాబాద్ నుంచి జూబ్లీ వరకు అదనంగా సర్వీసులు నడుపుతున్నారు. గురువారం 29 స్పెషల్ బస్సులు నడిపారు. శుక్రవారం 10, ఆ తర్వాత ఐదు బస్సుల చొప్పున నడపనున్నారు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు స్పెషల్ బస్సులను పెద్ద సంఖ్యలో నడుపుతామని ఆర్‌ఎం ఖుస్రోషహా ఖాన్ తెలిపారు.