నేత్ర మనోహరం.. మహా రథోత్సవం
అనంతపురం కల్చరల్: మూడు రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు గురువారం మహా రథోత్సవంతో ముగిశాయి. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా మడుగు రథానికి భక్తులు నీరాజనాలర్పించారు. వేదపురోహితులు మంత్రోచ్ఛారణతో ముందుకు సాగుతుండగా చిన్నారులు కోలాటం, భక్తిగీతాలు, ఆటపాటలతో రథం ముందు ఆనందోత్సాలతో నడిచారు.
రాఘవేంద్రస్వామి పాత్రధారి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ప్రాతఃకాల నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, పంచామృతాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రత్యేక పుష్పాలంకారం, తులసీ అర్చన, హస్తోదకం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి.