
'ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ'
విజయవాడ: తనమీద ఆరోపణలు వచ్చిన ప్రతీసారీ ‘ స్టే’లు తెచ్చుకోవడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...గతంలో అనేక కేసుల్లో స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఆయన స్టే తెచ్చుకుంటున్నారంటే సగం తప్పు అంగీకరించినట్లే అని అన్నారు. రెడ్హ్యాండెడ్గా దొరికిన దొంగ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో మరోసారి మోసం చేసే యత్నం జరుగుతుందన్నారు.
చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే కేసు ఉపసంహరించుకుని విచారణకు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు. తనకు ఏమీ కాదని చెప్పిన సీఎం ఎందుకు స్టేకు వెళ్లారని రఘువీరా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి కేసును నీరుగారుస్తున్నాయని తప్పుపట్టారు. కాగా తనపై ఏసీబీ విచారణ నిలిపివేయాలంటూ చంద్రబాబు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.