టీడీపీ ఉనికి కోసమే పవన్ కళ్యాణ్‌ను తెరపైకి తీసుకువస్తున్నారని రెహ్మాన్ విమర్శించారు
సుల్తాన్ బజార్ : ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఉనికి కోసమే పవన్ కళ్యాణ్‌ను తెరపైకి తీసుకువస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి హెచ్.ఎ. రెహ్మాన్ విమర్శించారు. ఈ మేరకు నగరంలోని కింగ్‌కోఠిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెహ్మాన్∙మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా అంటూ వస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఏపీలో టీడీపీ ఉనికి కోసం వస్తున్నాడని ఆయన అన్నారు.
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనే భయం చంద్రబాబునాయుడికి పట్టుకుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్రమోడి, చంద్రబాబుకు అనుకూలపరుడని ప్రజలు ఇప్పటికే గుర్తించారని తెలిపారు.
ఎన్నికల్లో రాత్రి పగలు కష్టపడి బాబుతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ దగ్గర ఉండి పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజలు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పోరాటం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన అన్నారు.