అదునులో అత్తెసరు ఖరీఫ్ సాగు అరకొరే..! | rain fall down in khareef season | Sakshi
Sakshi News home page

అదునులో అత్తెసరు ఖరీఫ్ సాగు అరకొరే..!

Published Sat, Jun 25 2016 8:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

అదునులో అత్తెసరు ఖరీఫ్ సాగు అరకొరే..!

అదునులో అత్తెసరు ఖరీఫ్ సాగు అరకొరే..!

జూన్ 22 నాటికి 16.8 మి.మీ తక్కువ వర్షపాతం
అన్నదాతలతో మేఘుడి దోబూచులాట
కారుమబ్బులు.. చిరు జల్లులకే పరిమితం
జూన్ ముగుస్తున్నా పదునెక్కని పొలాలు
గిద్దలూరు ప్రాంతంలో మాత్రం ఒక మోస్తరు వర్షం
వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపు

 మేఘాలు అన్నదాతలతో దోబూచులాడుతున్నారుు.. మురిపించి మొహం చాటేస్తున్నారుు. ఈ ఏడాది ప్రారంభంలో ముందస్తుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పదే పదే ప్రకటించినా ఇప్పటి వరకు జిల్లాలో చిరు జల్లులు మినహా పొలాలు పదునెక్కే వ ర్షం కురవలేదు. నైరుతి రుతుపవనాలు చినుకు రాల్చక అన్నదాత ఆశలపై నీళ్లు చల్లాయి. మే, జూన్  ప్రారంభంలో

 ఓ మోస్తరు వర్షాలు కురిసినా పొలాలు పదునెక్కలేదు. మరోసారి మంచి వర్షాలు పడితే ఖరీఫ్ సాగు ఆరంభిద్దామని అన్నదాతలు భావిస్తున్నారు. వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో గిద్దలూరు నియోజకవర్గం మినహా మరెక్కడా సరైన వర్షాలు కురవలేదు. చిరుజల్లులు తప్ప పదును వర్షం కురవలేదు. దీంతో పొలాలు ఇంకా బీళ్లుగానే ఉన్నారుు. ఖరీఫ్ సాగు అంతంతమాత్రంగానే సాగుతోంది. జనవరి నుంచి జూన్ 22వ తేదీ నాటికి 147.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 130.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో ఎక్కువ మంది అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకొని పచ్చిరొట్ట, పిల్లిపెసర తదితర పంటలు వేశారు. అక్కడక్కడా కంది, సజ్జ సాగు చేశారు. మరోమారు మంచి వర్షాలు కురిసి నేల పదునైతే గాానీ జిల్లా వ్యాప్తంగా కంది, పత్తి, పొగాకు, సజ్జ తదితర పంటలు సాగయ్యే పరిస్థితి లేదు.

 జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 66,026 హెక్టార్లలో పత్తి, 53,611 హెక్టార్లలో కంది, 32,185 హెక్టార్లలో వరి, 22,943 హెక్టార్లలో మిరప, 17,030 హెక్టార్లలో సజ్జ, పెసర, మినుము, వేరుశనగ, పొద్దు తిరుగుడు, చెరకు, పొగాకు తదిపంటలు సాగు కావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 2,35,857 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 19,043 హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

గిద్దలూరు నియోజకవర్గంలో మంచి వర్షం కురిసింది. చిన్నచిన్న కుంటలు, చెరువులకు అరకొర నీరు చేరింది. పదును కావడంతో పొలాలు దుక్కిలు దున్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం నువ్వులు, కంది, సజ్జలతో పాటు కొంత మేర పచ్చిమిరప సాగు చేస్తున్నారు.

దర్శి నియోజకవర్గంలో పదును వర్షం కురిసింది. గతంలో వేసిన పెసర దెబ్బతినడంతో దాన్ని చెడగొట్టి కంది పంటను సాగు చేస్తున్నారు. ఇక ప్రధానంగా నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ పరిధిలో 1,70,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, 80 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ఉంటుంది. నీళ్లొస్తే వరి నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండేళ్లుగా వర్షాల్లేకపోవడంతో ఎన్‌ఎస్‌పీ కింద పొలాలు బీడుగా ఉన్నాయి.

అద్దంకి నియోజకవర్గంలో పదును వర్షం కురిసింది. బీటీ ప్రత్తి విత్తనాలు సాగు చేస్తున్నారు. కంది పంట వేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. అక్కడ సజ్జ, జొన్న పంటలను సాగు చేశారు. మరింత వర్షం కురిస్తే కంది, పత్తి, పెసర సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

చీరాల నియోజకవర్గంలో కొద్దిపాటి వర్షం మాత్రమే కురిసింది. పదును కాలేదు. దీంతో పొలాలు బీళ్లుగానే ఉన్నారు. కొమ్మూరు కాలువ కింద లక్ష ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. నాగార్జున సాగర్ నీరొస్తేనే వరి సాగవుతుంది. మరోమారు వర్షం కురిస్తే పెసర, శనగ, మిరపతో పాటు పొగాకు నాటుతారు.

యర్రగొండపాలెం మండలంలో వర్షాల్లేవు. వర్షం కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. మే నెలలో మాత్రమే కొద్దిపాటి వర్షం కురవడంతో దుక్కులు సిద్ధం చేశారు. వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మంచి వర్షం కురిస్తే కంది, మిరప, ప్రత్తి సాగు చేస్తారు.

కందుకూరు నియోజకవర్గంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. పచ్చిరొట్ట, జీలుగ, పిల్లి పెసర వేశారు. మరోమారు వర్షం కురిస్తే కంది సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

కనిగిరి నియోజకవర్గంలో కొద్దిపాటి వర్షం మాత్రమే కురిసింది. కురిసిన వర్షానికి పొలాలను సిద్ధం చేశారు. పదును వర్షం కురిస్తే కంది వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

కొండపి నియోజకవర్గంలో ఒక మోస్తరు వర్షం మాత్రమే కురిసింది. నువ్వు పంటకు అనుకూలంగా ఉండటంతో ఇప్పటి వరకు వెయ్యి హెక్టార్లలో సాగు చేశారు. మరోమారు వర్షం వస్తే కంది వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

మార్కాపురం నియోజకవర్గంలో వర్షం నామమాత్రంగానే కురిసింది. పొలాలు దుక్కులు దున్ని పెట్టుకున్నారు. మరోమారు పదును వర్షం వస్తే కంది, సజ్జ పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.

పర్చూరు నియోజకవర్గంలో ఇటీవల పదును వర్షం కురవడంతో దుక్కులు సిద్ధం చేసుకున్నారు. మరోమారు వర్షం కురిస్తే ప్రత్తి సాగు చేసేందుకు అనుకూలం. కారంచేడు ప్రాంతంలో సాగర్ నీళ్లు వస్తేనే వరి సాగు చేస్తారు.

సంతనూతలపాడు నియోజకవర్గంలో పొలాలు పదును కావడంతో రైతులు దుక్కులు పూర్తి చేశారు. వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. సాగర్ నీరు వస్తే వరి సాగు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement