రాయలసీమకు వర్షసూచన
► తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం: నాలుగు రోజుల కిందట ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలోకి మారింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనమూ కొనసాగుతోంది.
లక్షద్వీప్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ఫలితంగా వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలో అక్కడక్కడ జల్లులు గాని, తేలికపాటి వర్షం గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని పేర్కొంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా పెరుగుతున్నాయి. ఏపీలో సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీలు, తెలంగాణలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు చొప్పున అధికంగా నమోదవుతున్నాయి.