'గుట్కా'య.. స్వాహా | Random banned the sale of tobacco products | Sakshi
Sakshi News home page

'గుట్కా'య.. స్వాహా

Published Wed, Jul 6 2016 2:44 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

'గుట్కా'య.. స్వాహా - Sakshi

'గుట్కా'య.. స్వాహా

* నిషేధిత పొగాకు ఉత్పత్తులు యథేచ్ఛగా విక్రయం
* పాన్‌పరాగ్, ఖైనీ, డీలక్స్ ప్యాకెట్లు రెట్టింపు ధరలకు విక్రయం
* నిత్యం రూ.కోట్లలో వ్యాపారం  మామూళ్ల మత్తులో అధికారులు

రాజాం: జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఏ పాన్ షాపులో చూసినా గుట్కాల తోరణాలే దర్శనమిస్తున్నాయి. ఒడిశా నుంచి నిత్యం కోట్లాది రూపాయల సరుకు జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పొందూరు, రాజాం వంటి  పట్టణాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి గ్రామీణ రిటైల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

ఒక్క రాజాం పట్టణంలోనే హోల్‌సేల్ వ్యాపారులు 20 మంది వరకు ఉన్నారు. వీరంతా సుమారు 500 మంది రిటైల్ వ్యాపారులకు సరుకును తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క రాజాం పట్టణంలోనే రోజుకి సుమారు రూ.10 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. జిల్లాలోని మిగిలిన పట్టణాల్లో ఇంకెంత వ్యాపారం జరుగుతుందో ఇట్టే అర్ధమవుతోంది.
 
పొగాకు ఉత్పత్తుల వినియోగంతో నష్టాలు
 పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, పాన్‌మసాలా, గుట్కా, పాన్‌పరాగ్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పళ్లు పుచ్చిపోవడం, రంగు మారిపోవడం వంటి వ్యాధులు సోకుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీటి విక్రయాలను నిషేధించింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
 
మార్కెట్లో దొరికిన సరుకే విక్రయిస్తున్నాం
ఇంట్లో అమ్మ, భార్య ఖాళీగా ఉన్నారని పట్టణంలో రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నాం. మార్కెట్లో దొరికిన సరుకే విక్రయిస్తున్నాం. ఇందులో లాభనష్టాలు ఏమిటో మాకు తెలియదు. అధికారులు వద్దంటే మానేస్తాం.
కేవీ పార్వతీశం, డోలపేట, రాజాం నగర పంచాయతీ
 
వ్యసనంగా మారింది
ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తోచక పాన్‌పరాగ్ తినేవాడిని. అది ఇప్పుడు వ్యసనంగా మారింది. రోజుకి 4 నుంచి 5 ప్యాకెట్లు తింటా. ఇవి తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో నాకు తెలియదు.
- ఇనుమల సత్యనారాయణ, పొనుగుటివలస, రాజాం నగర పంచాయతీ
 
అలవాటు మార్చుకుంటాం
మార్కెట్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేస్తే అలవాటు మార్చుకుంటాం. మార్కెట్‌లో లభించినంత వరకు వాటిపైనే దృష్టి మరలుతోంది.
- కెంబూరు వెంకటరమణ, రాజాం
 
ప్రభుత్వ ఉత్తర్వులకు అధికారుల తూట్లు
ప్రజారోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకునే అధికారం స్థానిక అధికారులకు అప్పగిస్తూ జీఓ నంబర్‌ను 6 విడుదల చేసింది. ఈ ఉత్తర్వులకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు బహిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు. అప్పుడప్పుడు రాజాం, పొందూరు, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాల్లో దాడులు జరిపి, వ్యాపారులపై పెట్టీ కేసులు నమోదు చేసి, విడిచిపెడుతున్నారు.

శిక్షలు కఠినంగా లేకపోవడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల ఒడిశా నుంచి లారీల్లో తరలిస్తున్న పాన్‌పరాగ్, ఖైనీ, డీలక్స్ వంటి సరుకును ఇచ్ఛాపురంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఈ సరుకు మద్రాస్ రవాణా చేస్తున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లను సైతం అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది.
 
రెట్టింపు ధరలకు విక్రయం
ఇటీవల అధికారులు వరుస దాడులు చేయడంతో ఒడిశా ప్రాంతం నుంచి సరుకు దిగుమతి తగ్గిపోయింది. కొంతమంది చాటుమాటుగా సరుకుతెచ్చి విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ప్రజల వ్యసనాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement