కర్నూలులో అరుదైన కదంబ వృక్షం
విరబూసిన పుష్పాలు
–ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు
–దేవతలకు ప్రీతిపాత్రం
దుర్గాదేవికి అత్యంత ప్రీతి పాత్రమైన కదంబ వృక్షాలకు పూలు విరగకాశాయి. అరుదైన ఈ వృక్షాలను 2013 జూలై 27న అప్పటి నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న పీవీవీఎస్ మూర్తి కలెక్టరేట్ వెనుకవైపున ఎ.క్యాంపులోని ఇందిరాగాంధి స్మాక నగర పాలక ఉన్నత పాఠశాలలో నాటారు. దీని శాస్త్రీయ నామం ఆంతోసెఫాలస్. శ్రీశైలం, తలకోన అడవుల్లో మాత్రమే కనిపించే ఈ వక్షం ఇప్పుడు కర్నూలులో కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రెండేళ్ల కాలంలో ఆ మొక్కలు ఇప్పుడు 15 అడుగుల ఎత్తుకు పెరిగాయి. వీటికి టెన్నిస్ బంతి ఆకారంలో, గుత్తులుగుత్తులుగా కాస్తున్న పూలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. లలితాదేవి/దుర్గాదేవికి కదంబవనవాసిని అని పేరని, కదంబ చెట్టు పరిసరాల్లో అమ్మవారు కొలువై ఉంటారని సంగమేశ్వరం దేవాలయం పూజారి తెలకపల్లి రఘురామశర్మ చెప్పారు. ఈ వక్షం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమని, ఈ చెట్టు కింద కూర్చుని లలితాసహస్రనామార్చన, దుర్గాదేవి నామార్చన, జపాలు చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మొక్కలను ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ తిరుపాల్‌రెడ్డి విరాళంగా ఇచ్చినట్లు పాఠశాల పీఈటీ కమాల్‌బాషా తెలిపారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు