నగదు కోసం రాస్తారోకో
గోనెగండ్ల: నగదు లేకపోవడంతో రైతులు, మహిళలు, ఖాతాదారులు బుధవారం మండల కేంద్రమైన గోనెగండ్లలో రాస్తారోకో చేశారు. నగదు కొంచెం ఉందని ఒక్కొక్కరికి రూ.2వేలు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో జనం సహనం కోల్పోయారు. రోడ్డుపై బైఠాయించి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తునా నినాదాలు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా కష్టపడ్డారు.ఎన్నిరోజులని నగదు కోసం బ్యాంక్‌కు తిరగాలంటూ వృద్ధులు, మహిళలు, రైతులు వాపోయారు. కనీసం రూ.10వేలు ఒక్కొక్కరికి నగదు ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి కదలమని భీష్మించుకొని కూర్చుకొన్నారు. దీంతో పోలీసులు వచ్చి సముదాయించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.చివరకు బ్యాంక్ మేనేజర్ వెంకన్నబాబు .. ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తామనడంతో శాంతించి ఆందోళనను విరమించారు. అయితే ఉన్న నగదు మధ్యాహ్నానికే అయిపోవడంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు.