‘గుర్తింపు’ ఎన్నికలు మరింత ఆలస్యం
-
2017 జనవరిలో నిర్వహించే అవకాశం ?
గోదావరిఖని : సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరింత ఆలస్యంగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2012 జూన్ 28వ తేదీన ఐదో దఫా ఎన్నికలు జరగగా.. అదే ఏడాది ఆగస్టు 6వ తేదీన గుర్తింపు సంఘంగా గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకెఎస్)కు అధికారికంగా యాజమాన్యం, ఆర్‌ఎల్‌సీ హోదా పత్రాన్ని అందజేసింది. నాలుగేళ్ల కాలపరిమితితో సంఘం కార్యకలాపాలను సాగించగా... ఈ నెల 6వ తేదీతో కాలపరిమితి పూర్తయింది. అయితే రీజినల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వíß ంచాల్సి ఉండగా... ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు ముందుకు సాగకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో సింగరేణిలో గుర్తింపు సంఘం నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయిందనే సమాచారాన్ని సింగరేణి యాజమాన్యం ఢిల్లీలో ఉన్న కేంద్ర కార్మిక శాఖ డెప్యూటీ ఛీప్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి, హైదరాబాద్‌లో ఉన్న రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి లేఖలు పంపించింది. ఆ తర్వాత తాము ఎన్నికలకు సిద్ధమంటూ మరో లేఖను ఈ శాఖల కార్యాలయాలకు పంపించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎన్నికలకు సిద్ధమనే లేఖ పంపలేదు. ఇదిలా ఉండగా గుర్తింపు సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఆగస్టు 6వ తేదీతో పూర్తి కావడంతో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలు కార్మిక శాఖ అధికారులకు లేఖలు రాశాయి. అదే సమయంలో యాజమాన్యంపై కూడా ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి.
మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచేందుకు..
సింగరేణిలో మళ్లీ గుర్తింపు సంఘంగా గెలవాలనే లక్ష్యంతో టీబీజీకేఎస్ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో పొందుపర్చడం, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాలు ప్రకటించిన తర్వాతనే గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం. అందువల్ల ప్రభుత్వం నుంచి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సిద్ధమంటూ కేంద్ర కార్మిక శాఖ, ఆర్‌ఎల్‌సీకి లేఖలు రాసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ జరగడానికి డిసెంబర్ వరకు సమయం తీసుకునే అవకాశాలున్నాయి. వారసత్వ ఉద్యోగాల ప్రకటన తర్వాత 2017 జనవరి నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ఇటు యాజమాన్యం, ఆటు ఆర్‌ఎల్‌సీ సిద్ధంగా ఉండవచ్చని తెలుస్తోంది. మొత్తమ్మీద నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపనున్న సింగరేణిలో మళ్లీ గులాబీ జెండా ఎగిరేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ యూనియన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.